మ‌రోసారి మెరిసిన బౌల‌ర్లు.. క‌ష్టాల్లో ఆసీస్‌.. విజ‌యానికి చేరువ‌లో భార‌త్‌..!

Ind vs Aus 2nd test Match. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా విజ‌యానికి

By Medi Samrat  Published on  28 Dec 2020 7:41 AM GMT
మ‌రోసారి మెరిసిన బౌల‌ర్లు.. క‌ష్టాల్లో ఆసీస్‌.. విజ‌యానికి చేరువ‌లో భార‌త్‌..!

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా విజ‌యానికి చేరువ‌లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన భార‌త్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌ను మ‌రోసారి క‌ట్ట‌డి చేసింది. దీంతో సోమ‌వారం మూడో రోజు ఆట ముగిసే స‌రికి ఆస్ట్రేలియా 6 వికెట్ల న‌ష్టానికి 133 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం ఆసీస్ 2 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. గ్రీన్‌(17), పాట్ క‌మిన్స్ (15) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ద‌యం మిగిలిన నాలుగు వికెట్ల‌ను ఎంత త్వ‌ర‌గా తీస్తార‌నే దానిపైనే భార‌త విజ‌యం ఆధార‌ప‌డి ఉంది.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 5 వికెట్ల న‌ష్టానికి 277 ప‌రుగుల‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భార‌త్.. మ‌రో 49 ప‌రుగులు మాత్ర‌మే జోడించి చివ‌రి ఐదు వికెట్ల‌ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య ర‌హానే(112) నిన్న స్కోర్‌కు మ‌రో 8 ప‌రుగులు మాత్ర‌మే జోడించి పెవిలియ‌న్ చేర‌గా.. జ‌డేజా అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. అశ్విన్‌(14), ఉమేశ్‌ యాద‌వ్‌(9), బుమ్రా(0) లు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో.. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 131 ప‌రుగుల కీల‌క ఆధిక్యం ల‌భించింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో స్టార్క్‌, లయ‌న్ చెరో మూడు వికెట్లు తీయ‌గా.. క‌మిన్స్ రెండు, హెజిల్‌వుడ్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

131 ప‌రుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఉమేశ్ యాద‌వ్ షాకిచ్చాడు. 4 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఓపెన‌ర్ జో బ‌ర్న్స్.. ఉమేశ్ బౌలింగ్‌లో పంత్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన ల‌బుషేన్‌(28) మ‌రో ఓపెన‌ర్ మాథ్యూవేడ్ (48)తో క‌లిసి ఆసీస్‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. వీరిద్ద‌రు వికెట్ కాపాడుకునేందుకే ప్ర‌య‌త్నం చేశారు. రెండో వికెట్‌కు 41 ప‌రుగులు జోడించి ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జంట‌ను అశ్విన్ విడ‌గొట్టాడు. ఓ చ‌క్క‌ని బంతితో ల‌బుషేన్‌ను బోల్తాకొట్టించాడు. పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తూ స్టీవ్‌స్మిత్ (8) బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌య్యాడు. ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. వేడ్‌, కెప్టెన్ టీమ్‌పైన్‌(1), ట్రావిన్స్ హెడ్‌(17) వెంట వెంట‌నే పెవిలియ‌న్ చేర్చారు. దీంతో 99 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. క‌మిన్స్‌, గ్రీన్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ఆడుతూ..మూడో రోజును ముగించారు. వీరిద్ద‌రు అభేద్య‌మైన ఏడో వికెట్‌కు 34 ప‌రుగులు జోడించారు.


Next Story
Share it