ఒలింపిక్స్ కు అర్హత సాధించిన 'మెన్ ఇన్ బ్లూ'

భారత హాకీ జట్టు ఆసియా గేమ్స్ లో అదరగొట్టింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

By Medi Samrat  Published on  6 Oct 2023 2:00 PM GMT
ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మెన్ ఇన్ బ్లూ

భారత హాకీ జట్టు ఆసియా గేమ్స్ లో అదరగొట్టింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో భారత్ సూపర్ విక్టరీని సాధించింది. అక్టోబర్ 6, శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 5-1తో 2018 ఛాంపియన్ జపాన్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. చైనాలోని హాంగ్ ఝౌలో జరిగిన ఫైనల్లో భారత్ 5-1తో జపాన్ ను ఓడించి ఆసియా క్రీడల హాకీ విజేతగా నిలిచింది. ఈ ఘనవిజయంతో పారిస్ ఒలింపిక్స్ బెర్తును కూడా భారత్ ఖరారు చేసుకుంది.

ఈ మ్యాచ్ లో భారత్ తరఫున హర్మన్ ప్రీత్ సింగ్ 32, 59వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టాడు. ఈ మ్యాచ్ లో తొలి గోల్ ను 25వ నిమిషంలో మన్ ప్రీత్ సింగ్ సాధించాడు. 36వ నిమిషంలో అమిత్ రోహిదాస్, 48వ నిమిషంలో అభిషేక్ గోల్స్ కొట్టారు. జపాన్ తరఫున 51వ నిమిషంలో సెరెన్ తనాకా ఏకైక గోల్ నమోదు చేశాడు. ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత్ స్వర్ణం గెలవడం ఇది నాలుగోసారి. 1966, 1998, 2014 ఆసియా క్రీడల్లోనూ భారత్ హాకీ ఈవెంట్ లో విజేతగా నిలిచింది.

ఆసియా గేమ్స్‌లో హాకీలో అత్యంత విజయవంతమైన పురుషుల జట్టులో భారత్ రెండో స్థానంలో దక్షిణ కొరియాతో సమంగా నిలిచింది. ఇరు దేశాలు 4 సార్లు ఆసియా గేమ్స్ ఛాంపియన్లుగా నిలిచాయి. ఆసియా క్రీడల్లో 9 స్వర్ణ పతకాలతో అత్యంత విజయవంతమైన పురుషుల జట్టుగా పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది.

Next Story