శ్రీలంక‌ను ఊడ్చేశారు.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు

IND beat SL by 238 runs in Pink Ball Test to clean sweep series 2-0.పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2022 8:48 AM IST
శ్రీలంక‌ను ఊడ్చేశారు.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు

పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత రోహిత్ శ‌ర్మ ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారింది. స్వ‌దేశంలో ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థుల‌తో త‌ల‌ప‌డిన టీమ్ఇండియా మూడు ఫార్మాట్ల‌లోనూ వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్‌తో టీ20(3-0), వ‌న్డే(3-0) సిరీస్‌ల‌ను శ్రీలంక‌తో మూడు టీ20లు, రెండు టెస్టుల్లోనూ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈ క్ర‌మంలోనే రోహిత్ ఖాతాలో ఓ రికార్డు వ‌చ్చి చేరింది. ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌ల్లోనే (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

లాంఛ‌నం ముగిసింది. ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ గులాబీ టెస్టులో లంక‌పై 238 ప‌రుగుల భారీ తేడాతో రోహిత్ సేన ఘ‌న విజయం సాధించింది. ఫ‌లితంగా రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. 447 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 28/1తో సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 208 పరుగులకు ఆలౌటైంది. ఆ జ‌ట్టు కెప్టెన్ దిముత్‌ కరుణరత్నె (107; 15 ఫోర్లు) సెంచరీతో కుషాల్‌ మెండిస్‌ (54) అర్థ‌శ‌త‌కంతో పోరాడాడు.

వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో లంక ల‌క్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్ నాలుగు తీయ‌గా, జస్ప్రీత్‌ బుమ్రా మూడు, అక్ష‌ర్ ప‌టేల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా.. రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థ‌శ‌త‌కాల‌తో రాణించిన బ్యాట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా ఎంపిక కాగా.. బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్‌లో రాణించాన పంత్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గా నిలిచాడు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 252 ఆటౌట్ కాగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 303/9 వ‌ద్ద డిక్లేర్ చేసింది.

శ్రీలంక‌పై టెస్టు సిరీస్ విజ‌యంతో 24 పాయింట్ల‌ను ఖాతాలో వేసుకున్న భార‌త్‌.. ప్రపంచ టెస్టు చాంపియ‌న్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచింది.

Next Story