ఉమెన్స్ ఐపీఎల్‌కు ముహూర్తం ఖ‌రారు..!

Inaugural edition of Womens IPL to be held in March 2023.వ‌చ్చే ఏడాది ఉమెన్స్ ఐపీఎల్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 5:12 AM GMT
ఉమెన్స్ ఐపీఎల్‌కు ముహూర్తం ఖ‌రారు..!

క్రికెట్‌లో ఎన్ని లీగ్‌లు ఉన్నా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) కు ఉన్న క్రేజే వేరు. ఇందులో పాల్గొనేందుకు ఆట‌గాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు 15 సీజ‌న్ల‌ను విజ‌య వంతంగా పూర్తి చేసుకుంది. కాగా..పురుషుల‌ క్రికెట్‌లోనే ఐపీఎల్ ఉంది. మ‌హిళ‌ల క్రికెట్లో కూడా ఐపీఎల్ ను ప్ర‌వేశ పెట్టాల‌ని ఎప్ప‌టి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. అదిగో ఇదిలో అంటూ ఇన్నాళ్లు మీన మేషాలు లెక్కించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎట్ట‌కేల‌కు ఆదిశ‌గా అడుగులు వేస్తోంది.

వ‌చ్చే ఏడాది ఉమెన్స్ ఐపీఎల్‌ను ప్రారంభించేందుకు గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసింది. మ‌హిళ‌ల దేశీయ క్రికెట్ క్యాలెండర్‌లో మార్పులు చేసింది. సాధార‌ణంగా భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు సీజ‌న్ న‌వంబ‌రుతో మొద‌లై ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగుతుంది. అయితే.. ఈ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌లో మొద‌లు పెట్టి ఫిబ్ర‌వ‌రికే సీజ‌న్‌ను ముగించ‌నున్నారు.

పురుషుల ఐపీఎల్ సీజ‌న్ కంటే ముందుగానే ఉమెన్స్ ఐపీఎల్‌ను ఆడించాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ మార్పును చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆరు జ‌ట్ల‌తో ఈ లీగ్‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత పురుషుల క్రికెట్ లీగ్ ఫ్రాంచైజీలే చాలా వ‌ర‌కు ఆస‌క్తితో ఉన్నాయి. వీటితో పాటు కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల ఐపీఎల్ లీగ్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని ఓ బీసీసీఐ అధికారి వెల్ల‌డించారు.

మ‌హిళ‌ల ఐపీఎల్ వ‌చ్చే ఏడాది మార్చి తొలి వారంలో ప్రారంభం అవుతుంది. నాలుగు వారాల పాటు తొలి సీజ‌న్ జ‌రుగుతుంది. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన కొన్ని రోజుల‌కే ఈ టోర్నీ ఆరంభం కానుంది. 5 లేదా ఆరు జ‌ట్ల‌తో ఈ లీగ్ జ‌ర‌గొచ్చు. త్వ‌ర‌లోనే జ‌ట్ల వేలం ప్ర‌క్రియ గురించి ప్ర‌క‌ట‌న రావొచ్చున‌ని తెలిపారు.

Next Story
Share it