బోర్డర్లను మూసేస్తే.. సౌతాఫ్రికాలో ఉన్న భారత క్రికెటర్ల పరిస్థితి ఏంటి..?
If Covid situation worsens CSA assures players immediate return.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 10:16 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకి ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటకు వెళ్లింది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సి ఉండగా.. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో టీ20 సిరీస్‌ను రద్దు చేసి మిగిలిన షెడ్యూల్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ప్రాక్టీస్ మొదలెట్టేశాయి.
ఓ వైపు మ్యాచులు ఆరంభం కానున్నాయని అభిమానులు సంతోషపడుతుండగా.. మరోవైపు ఆటగాళ్లు క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి అధికమై.. బోర్డర్లు మూసివేస్తే భారత ఆటగాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ షూయబ్ మంజ్రా ఊరట కలిగించే వార్త చెప్పారు. ఒకవేళ ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగి.. సరిహద్దులు మూసివేయాల్సిన పరిస్తితి వస్తే.. వెంటనే భారత ఆటగాళ్లను స్వదేశానికి పంపిచేందుకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు.
టీమ్ఇండియాకు అన్ని ఆప్షన్లూ ఓపెన్ గా ఉంటాయని, ఏ సమయంలోనైనా వారు సొంత దేశానికి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చని చెప్పారు. అయితే భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయం గురించి మాత్రమే తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇక దీనిపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. తాము దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో టచ్‌లోనే ఉన్నామన్నారు. భారత జట్టు సురక్షిత వాతావరణంలోనే ఉందని, ఏమైనా ఇబ్బంది కలిగితే.. వెంటనే వచ్చేందుకు అప్పటికప్పుడు అన్ని ఏర్పాటు చేస్తామని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాట ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇక టీమ్ఇండియా, సౌతాఫిక్రా జట్ల మధ్య టెస్టు సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు కనీసం ఈ సారైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తొలి టెస్టు మ్యాచ్ మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు.