పరువు కోసం కోహ్లీసేన పోరాటం.. సంచలనం కోసం అప్గాన్ ఆరాటం
ICC T20 World Cup 2021 Today match between India vs Afghanistan.టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోర ప్రదర్శనతో
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2021 10:50 AM ISTటీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోర ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ లతో జరిగిన మ్యాచ్‌లలో ఓటమిపాలవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడనుంది ఇంకా మూడు మ్యాచ్‌లే. అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాతో ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. అప్పటికి కూడా ఇతర జట్ల ఫలితాలపైనే మన సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు అఫ్గాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా దెబ్బతిన్న పులిలా విజృంభిస్తుందా..? లేక మరో ఓటమితో రేసు నుంచి తప్పుకుంటుందా అన్న నేడు తేలిపోతుంది.
ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే.. అఫ్గాన్ జట్టు షాకిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే నమీబియా, స్కాట్లాండ్‌పై భారీ తేడాతో నెగ్గిన అప్ఘాన్.. పాకిస్థాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ పరిస్థితుల్లో భారత జట్టు అప్గాన్‌పై గెలవాలంటే తమ శక్తివంచన లేకుండా పోరాడాల్సిందే. దుబాయ్ పిచ్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కోహ్లీసేన.. అబుదాబిలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది.
ఇక ఇరు జట్లకూ ఈ మ్యాచ్ కీలకమే.. ఇప్పటి వరకు భారత జట్టు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఓటమి పాలైంది. సెమీస్ ఆశలు ఉండాలంటే టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. అప్గాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు విజయాలతో 4 పాయింట్ల సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ పై విజయం సాధించి సెమీస్ రేసులో మరింత ముందుకు దూసుకువెళ్లాలని అప్గాన్ బావిస్తోంది. ఇప్పటికే ఈ గ్రూప్‌లో ఉన్న పాకిస్థాన్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఇక మిగిలిన ఒక స్థానం కోసం అఫ్గాన్, కివీస్, భారత్ పోటిపడుతున్నాయి.