ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్ -10లో నలుగురు భారత ఆట‌గాళ్లు

ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ ప్ర‌యోజ‌నాన్ని పొందాడు.

By Medi Samrat  Published on  5 March 2025 9:00 PM IST
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్ -10లో నలుగురు భారత ఆట‌గాళ్లు

ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ ప్ర‌యోజ‌నాన్ని పొందాడు. కోహ్లి రెండు స్థానాలు ఎగబాకి మొదటి ఐదు స్థానాల్లో చేరాడు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి 91 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని న‌మోదు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ -10లో నలుగురు భారత ఆట‌గాళ్లు ఉన్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 791 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయినా.. మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (195 పరుగులు) ఒక్క స్థానం ఎగబాకాడు.

ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 72.33 సగటుతో 83.14 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. కోహ్లీ ఇటీవల పాకిస్థాన్‌పై అజేయ సెంచరీ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ ఇంగ్లండ్‌పై 177 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం ద్వారా లాభపడ్డాడు. 13 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి వ‌చ్చాడు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు అక్షర్ పటేల్ 17 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా తప్ప టాప్ 10లో ఎవరూ లేరు. 213 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు స్థానాలు ఎగబాకి టాప్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.


Next Story