ఐసీసీ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది
By Medi Samrat
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు చివరి టెస్టు జూలై 31 నుంచి లండన్‌లోని ఓవల్‌లో జరగనుంది. ఈ టెస్టుకు ముందు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
మాంచెస్టర్ టెస్టు డ్రా తర్వాత భారత్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు ర్యాంకింగ్స్‌లో పెద్ద ఎత్తున దూసుకెళ్లారు. అదే సమయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టెస్ట్ ర్యాంకింగ్స్ కంటే T20I ర్యాంకింగ్స్‌లో ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లు కనిపించారు.
అభిషేక్ శర్మ ICC పురుషుల T20I బ్యాటర్స్ ర్యాంకింగ్‌లో మొదటిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌పై ఓ లుక్కేద్దాం.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 ర్యాంక్ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ నుంచి నంబర్-1 సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఏడాదికి పైగా హెడ్ నంబర్-1లో కొనసాగారు. అంతర్జాతీయ స్థాయిలో అభిషేక్ గత సంవత్సరం జింబాబ్వేపై T20I సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత ట్రావిస్‌ను నంబర్-2కి నెట్టేశాడు అభిషేక్.
ఇతడితో పాటు జోష్ ఇంగ్లీష్ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. టిమ్ డేవిడ్ 12 స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌కు చేరుకోగా, కెమరూన్ గ్రీన్ 64 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో 205 పరుగులు చేయడం ద్వారా అతను ఈ భారీ జంప్ చేశాడు. ఆస్ట్రేలియా పేస్‌మెన్ నాథన్ ఎల్లిస్ 7 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌కు చేరుకోగా, సీన్ అబాట్ 21 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ 904 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఒక స్థానం ఎగబాకి 7వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ 5 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ ర్యాంకింగ్స్‌లో 3 స్థానాలు కోల్పోయి 769 రేటింగ్‌తో 8వ స్థానానికి పడిపోయాడు. మాంచెస్టర్‌లో అద్భుత సెంచరీ చేసిన రవీంద్ర జడేజా ఐదు స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకున్నాడు. ఇతడితో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 8 స్థానాలు ఎగబాకి 34వ స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో బెన్ స్టోక్స్ 3 స్థానాలు ఎగబాకగా, టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నంబర్-1 స్థానంలో ఉన్నాడు.