భారత్‌లో 2023 వన్డే ప్రపంచకప్ జరగదా..?
ICC ODI World Cup 2023 Might Be Moved Out of India.వన్డే ప్రపంచకప్ 2023కి వచ్చే ఏడాది భారత దేశం అతిథ్యం ఇవ్వనున్న
By తోట వంశీ కుమార్
వన్డే ప్రపంచకప్ 2023కి వచ్చే ఏడాది భారత దేశం అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 సంవత్సరాల తరువాత ఈ మెగా టోర్నీ భారత్‌లో జరగనుండడంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అయితే.. వారి ఆశలు ఆవిరి అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మన దేశం నుంచి ప్రపంచకప్ తరలిపోయే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వానికి పన్ను చెల్లింపు విషయమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఐసీసీ భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని బీసీసీఐ కి సూచించింది.
మెగాటోర్నీలకు అతిథ్యం ఇచ్చే దేశాలు ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు పొందాలని గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో నిర్ణయం తీసుకున్నారు. పన్ను మినహాయింపుపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ రాలేదు. దీంతో పన్ను చెల్లింపుల విషయంలో తాము చేసేది ఏమీ లేదని, కావాలంటే ఈ మెగా టోర్నీని భారత్‌లో కాకుండా ఎక్కడ నిర్వహించుకున్నా తమకు అభ్యంతరం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఐసీసీకి తెలిపినట్లు సమాచారం.
ఇక 2016 టీ20 ప్రపంచకప్‌కు భారత్ అతిథ్యం ఇచ్చింది. ఆ సమయంలో కూడా ఐసీసీకి భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సారి కూడా అలాగే జరిగితే 2023 వన్డే ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.