Video : దుమ్ములేపుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్‌.. ఓ లుక్కేయండి..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ సంయుక్తంగా నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on  7 Feb 2025 5:20 PM IST
Video : దుమ్ములేపుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్‌.. ఓ లుక్కేయండి..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఎన్నో వివాదాలు, సన్నాహాల్లో జాప్యం న‌డుమ‌ పాకిస్థాన్ టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధమైంది. ఈ టోర్నీ థీమ్ సాంగ్‌ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. ఈ పాటను పాకిస్తాన్ ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లాం పాడారు. ఈ పాటను అబ్దుల్లా సిద్ధిఖీ నిర్మించారు. అద్నాన్ ధూల్-అస్ఫంద్యార్ అసద్ ద్వయం రాశారు. ఈ పాటను పాకిస్థాన్ వీధుల్లో, స్టేడియంలలో చిత్రీకరించారు.


ఈ సందర్భంగా సింగ‌ర్‌ అతిఫ్ మాట్లాడుతూ.. తాను క్రికెట్‌కు వీరాభిమానినని, భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తానని చెప్పాడు. నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని, నేను ఒక‌ప్పుడు ఫాస్ట్ బౌలర్‌ను కావాలనుకున్నాను, నేను ఆటను అర్థం చేసుకున్నాను. ఆటపై నాకు మక్కువ ఉంది. ఒక అభిమానిగా.. మైదానంలో ప్రేక్షకులను ఉత్సాహపరిచే విష‌య‌మై నేను కొంత‌ సంబంధం కలిగి ఉన్నాను. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. భారతదేశంలో కూడా తన పాటలతో ప్రకంపనలు సృష్టించిన గాయకుడు అతిఫ్. ఆయన పాటలు భారత్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ పాటలో కూడా అతిఫ్ తన గానంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.

ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దీనికి కారణం భద్రత. దీంతో చాలా వివాదాలు చోటుచేసుకోవడంతో భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఒకవేళ భారత్ సెమీఫైనల్, ఫైనల్స్ చేరినా.. ఈ మ్యాచ్ లు దుబాయ్ లోనే జరగనున్నాయి. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Next Story