క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది. గత ప్రపంచకప్ లాగే.. రెండు గ్రూపులుగా సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమ్ఇండియా గ్రూప్-2లో ఉంది. గ్రూప్-2లో భారత్ తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూప్-1లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ లు ఉన్నాయి. మిగతా జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి సూపర్-12లోకి రంగప్రవేశం చేస్తాయి.
అక్టోబర్ 23న దాయాదుల పోరును చూడొచ్చు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో తమ తొలిపోరులో భారత్ తలపడనుంది. కాగా టీ20 ప్రపంచకప్-2021 లీగ్ దశలో పాక్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఇక నవంబర్ 9న తొలి సెమీఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. మెల్‌బోర్న్ వేదికగా నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లలో శ్రీలంక, నమీబియా, వెస్టిండీస్, స్కాట్లాండ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి.