టీ20 ఫార్మాట్‌కు రోహిత్ రిటైర్‌మెంట్.. స్పందించిన హిట్‌మ్యాన్.. ఏమన్నాడంటే..?
I have not given up on T20 format says Rohit Sharma.టీ20ల్లో తన స్థానం, పొట్టి ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ వీడ్కొలు
By తోట వంశీ కుమార్ Published on 10 Jan 2023 8:06 AM ISTఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ నుంచే టీమ్ఇండియా ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తరువాత టీమ్ఇండియా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో టీ20 సిరీస్‌లు ఆడింది. ఈ రెండు సిరీస్‌లకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఆడలేదు. దీంతో ఇకపై వీరు ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం కష్టమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అటు సెలక్టర్లు డైరెక్టుగా ఈ విషయాన్ని చెప్పనప్పటికీ ఇందుకు సంబంధించిన పలు సూచనలు ఇచ్చారు.
టీ20లకు హార్థిక్ పాండ్యను రెగ్యులర్ కెప్టెన్‌గా నియమిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అఫీషియల్‌గా ఈ విషయాన్ని చెప్పనప్పటికి గత రెండు సిరీస్‌లకు పాండ్యనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ మార్పు, టీ20ల్లో తన స్థానం, పొట్టి ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ వీడ్కొలు చెప్పనున్నాడు అనే వార్తలపై భారత సారధి రోహిత్ శర్మ స్పందించాడు. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడంపై తానింక ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు.
అన్ని ఫార్మాట్లలలో ఆడే ఆటగాళ్లు వరుసగా మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదు. విరామం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జాబితాలో నేను ఉన్నాను. త్వరలోనే కివీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరువాత ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే.. టీ20లకు వీడ్కోలు పలికే ఆలోచన అయితే లేదు అని లంకతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ చెప్పుకొచ్చాడు.
లంకతో వన్డే సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండడం లేదని తెలిపాడు. బెంగళూరులో ఉన్న ఎన్‌సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) బుమ్రా అక్కడ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న క్రమంలో కండరాలు పట్టేశాయి. దీంతో లంకతో వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడం లేదని హిట్‌మ్యాన్ చెప్పాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ద్విశతకం బాదిన ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు తొలి వన్డేలో చోటు లేదని, శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని రోహిత్ అన్నాడు.