2021 టీ20 ప్రపంచ కప్‌లో భారతజట్టు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో T20I కెప్టెన్సీ నుండి వైదొలగాలని అప్పట్లో కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. ఈ ఘటన తర్వాత విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య శత్రుత్వం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. T20I సారథిగా వైదొలగాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించమని BCCI తనను ఎప్పుడూ కోరలేదని ఆ సమయంలో విరాట్ కోహ్లీ చెప్పడంతో సౌరవ్ గంగూలీని కోహ్లీ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. కోహ్లీ కెప్టెన్‌గా వైదొలగడంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాత్ర ఉందని ప్రచారం జరిగింది.
మరోసారి గంగూలీ మాట్లాడుతూ.. తాను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించలేదని క్లారిటీ ఇచ్చారు. దీని గురించి చాలా సార్లు చెప్పాను. అతను టీ20 జట్టును నడిపించడానికి ఆసక్తిగా లేడు. కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత.. టీ20 జట్టును నడిపించాలని ఆసక్తి లేకపోతే మొత్తం వైట్‌బాల్ క్రికెట్ కెప్టెన్‌గా తప్పుకోవాలని మాత్రమే అతనికి చెప్పానన్నాడు గంగూలీ. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని చేపట్టడానికి రోహిత్ శర్మ మొదట్లో సిద్ధంగా లేడని, అతను బాధ్యతలు చేపట్టేలా తాను ప్రోత్సహించినట్టు చెప్పాడు. ఆ విషయంలో మాత్రమే తన పాత్ర ఉందన్నాడు.