బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఎలా ప్రభావితం చేయ‌నుందంటే..?

How the Border-Gavaskar Trophy could affect the World Test Championship.భార‌త్‌, ఆస్ట్రేలియా అభిమానులే కాకుండా ప్ర‌పంచ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2023 9:35 AM GMT
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఎలా ప్రభావితం చేయ‌నుందంటే..?

భార‌త్‌, ఆస్ట్రేలియా అభిమానులే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భార‌త్ అతిథ్యం ఇస్తుంది. ఇప్ప‌టికే మ‌న దేశానికి వ‌చ్చిన ఆసీస్ ఆట‌గాళ్లు ప్రత్యేక పిచ్‌ల‌ను త‌యారు చేయించుకుని సాధ‌న చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 9న నాగ‌పూర్ వేదిక‌గా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిఫ్ ఫైన‌ల్ చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో విజ‌యం సాధించ‌డం టీమ్ఇండియాకు చాలా కీలకం. ఎంత తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తే భార‌త్ ఫైన‌ల్ చేరుకుంటుంది. ఆసీస్ ప‌రిస్థితి ఎలా ఉంది.? ఈ సిరీస్ ఫ‌లితం ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌ను ఏ విధంగా ప్ర‌భావితం చేయ‌నుందో చూద్దాం.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌కు చేరే రెండు జ‌ట్లు ఏవో ఇంకా తేల‌లేదు. WTC సైకిల్‌లో మ‌రో మూడు సిరీస్‌లు మాత్ర‌మే ఉన్నాయి. అవి భారత్ vs ఆస్ట్రేలియా (నాలుగు టెస్టులు), న్యూజిలాండ్ vs శ్రీ లంక (రెండు) మ‌రియు దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ (రెండు).


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 75.56 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది, భారతదేశం (58.93), శ్రీలంక (53.33) మరియు దక్షిణాఫ్రికా (48.72) లు ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ WTC పాయింట్ల పట్టికను ఎలా ప్రభావితం చేస్తుంది?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్‌ల విషయానికొస్తే రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా ప్ర‌స్తుతానికైతే రెండో స్థానంలో ఉంది. ఆ త‌రువాత శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికా లు ఉన్నాయి. ఇక శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికాలు ఇంకో సిరీస్ ఆడే అవ‌కాశం ఉండ‌డం, ఆసీస్ చేతిలో టీమ్ఇండియా ఓడితే స్థానాలు మారుతాయి.

అయితే.. ఆస్ట్రేలియా ఓడిన‌ప్ప‌టికీ అగ్ర‌స్థానానికి వ‌చ్చిన ఢోకా లేదు. కాబ‌ట్టి ఎలాంటి సంబంధం లేకుండా ఆసీస్ ఫైన‌ల్ చేరుకుంటుంది. ఒక‌వేళ ఆసీస్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడానికి భారత్‌ను (4-0) క్లీన్ స్వీప్ చేస్తే అప్ప‌డు 80.07 విజయ శాతంతో ఆసీస్ స‌గ‌ర్వంగా ఫైన‌ల్‌లో అడుగుపెడుతుంది.

ఆస్ట్రేలియాపై 3-1, 3-0 లేదా 4-0తో తేడాతో టీమ్ఇండియా విజ‌యం సాధిస్తే అప్పుడు భార‌త్ విజ‌య‌శాతం 60 కంటే ఎక్కువ‌గా న‌మోదు అవుతుంది. దీంతో రెండో స్థానంలో అలాగే కొన‌సాగుతూ ఫైన‌ల్ చేరుకుంటుంది.శ్రీలంక 2-0తో న్యూజిలాండ్‌ను ఓడించినప్పటికీ ఫైనల్‌కు చేరుకోదు. ఎందుకంటే లంకేయుల విజయ శాతం 60కి కాస్త అటు ఇటుగానే ఉంటుంది.

ఒక‌వేళ భార‌త్- ఆస్ట్రేలియా సిరీస్ 2-2తో డ్రా అయి, కివీస్‌పై రెండు మ్యాచ్‌ల‌ను లంక గెలిస్తే మాత్రం అప్పుడు లంక ఫైన‌ల్ చేరుతుంది.

వెస్టిండీస్‌ను స‌ఫారీలు 2-0తో క్లీన్ చేసిన‌ప్ప‌టికి ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్ చేరాలంటే అద్భుత‌మే జ‌ర‌గాలి. ఆస్ట్రేలియా చేతిలో భార‌త్ ఘోరంగా ఓడిపోవాలి. అదే స‌మ‌యంలో కివీస్ ఒక్క మ్యాచ్ అయిన లంక‌పై విజ‌యం సాధించాలి,

ప్ర‌స్తుతం ఉన్న స‌మీక‌ర‌ణాలు చూసుకుంటే.. ఇత‌ర జ‌ట్ల‌పై ఆధారప‌డ‌కుండా భార‌త్ నేరుగా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ చేరాలంటే నాలుగు టెస్టుల్లో క‌నీసం మూడు గెలవాల్సిందే.

మొత్తం మీద ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లీగ్ దశ ఉత్కంఠభరితంగా ముగిసేలా కనిపిస్తోంది. రాబోయే రెండు నెలలు చాలా కీల‌కం.

Next Story