అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా తడబడింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిందనే ఆనందం భారత్‌కు ఎంతో సేపు నిలవలేదు. 9/1 స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు ఏ దశలోనూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించలేదు. కమిన్స్ వేసిన తొలి ఓవర్‌లోనే 2పరుగులు చేసిన నైట్‌వాచ్‌మెన్ బుమ్రా వెనుదిరిగాడు. బుమ్రాతో మొదలైన టీమిండియా వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. కేవలం 10 పరుగుల వ్యవధిలో 5 వికట్లు కోల్పోయిందంటే.. వికెట్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉదయం పిచ్ పై ఉన్న తేమను స్వదినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా పేసర్లు కమిన్స్, హాజల్‌వుడ్ భారత బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు. పుజారా(0), మయాంక్(9), రహానే(0), కోహ్లీ(4), హనుమ విహారి(8), సాహా(4), అశ్విన్(0) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. ఉమేశ్ యాదవ్ ఓ బౌండరీ బాదగా.. షమీ(1) రిటైర్ హార్ట్‌గా వెనుదిరగడంతో.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. షమీ బ్యాటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇదే అత్యత్ప స్కోర్. భారత బాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, హెజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఆదిక్యం కలుపుకుని భారత్.. ఆసీస్ ముందు 90 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది.