గుడ్ ఫ్రైడే ముందు రోజు పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఏడు నెలల కాలానికి గాను రూ.30 కోట్లు విడుదల చేయగా.. ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ. 30 కోట్లు బడ్జెట్ ను మైనారిటీ సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మే నెల నుంచి నవంబరు వరకు(7 నెలలు) పాస్టర్లకు గౌరవ వేతనాలు చెల్లింపు కోసం ఈ మొత్తాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు త్వరలోనే క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వారి వారి బ్యాంక్ అకౌంట్లకు గౌరవ వేతనాన్ని జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే ముందు రోజున ప్రభుత్వం పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు చెల్లింపు కోసం రూ. 30 కోట్లు మొత్తాన్ని విడుదల చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నదని అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలను మైనారిటీ శాఖా మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.