అతడో మెజిషియన్.. వాటిని పట్టించుకోం : రోహిత్ శర్మ
Honestly we don't talk about rankings says Rohit Sharma.ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2023 11:23 AM ISTఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో వన్డే ర్యాకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ(101; 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు)లు సెంచరీలు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కివీస్ 41.2 ఓవర్లలో 295 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్ అనంతరం జట్టు విజయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ రోజు విజయం సాధించడంలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, గిల్ లు కీలక పాత్ర పోషించాడన్నాడు. జట్టులో అందరూ శార్దూల్ ఠాకూర్‌ను మెజిషియన్ అంటారని, అందుకు తగ్గట్లే జట్టుకు అవసరమైన సందర్భంలో బ్యాటు, బంతితో రాణిస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఇక తాను శతకం చేయడం ఆనందంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ సెంచరీ తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందన్నాడు. తాము ర్యాంక్సింగ్ గురించి ఏ మాత్రం పట్టించుకోమని, మైదనాంలో సత్తా చాటడంపై దృష్టి పెడతామని అన్నాడు.
వన్డే క్రికెట్‌లో ప్రణాళికలకు తగ్గట్లు రాణించడం ఎంతో ముఖ్యమని, మైదానంలో మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంతోనే గత ఆరు మ్యాచుల్లో విజయం సాధ్యమైందన్నాడు. ఆస్ట్రేలియా నాణ్యమైన జట్టు అని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ టీమ్‌పై గెలవడం అంత సులువైన విషయం కాదన్నాడు. అయినప్పటికీ తాము పై చేయి సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు రోహిత్.