దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ జెర్సీ నంబర్ 16ను రిటైర్ చేయాలని హాకీ ఇండియా బుధవారం నిర్ణయించింది. ఇటీవల ముగిసిన పారిస్ గేమ్స్‌లో దేశానికి వరుసగా రెండో ఒలింపిక్ పతకాన్ని సాధించడంలో ఈ స్టార్ ఆటగాడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా 16వ నంబర్ జెర్సీని ధరించిన 36 ఏళ్ల శ్రీజేష్ జూనియర్ హాకీ జట్టు జాతీయ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళనాథ్ సింగ్ ప్రకటించారు. "శ్రీజేష్ ఇప్పుడు జూనియర్ జట్టుకు కోచ్‌గా మారబోతున్నాడు. శ్రీజేష్ గౌరవార్థం సీనియర్ జట్టులో మేము 16 నంబర్ జెర్సీని రిటైర్ చేస్తున్నాము. జూనియర్ జట్టులో 16 నంబర్ జెర్సీని ఆటగాళ్లు ధరించవచ్చని" అని భోళనాథ్ సింగ్ చెప్పాడు.
స్పెయిన్‌ను 2-1తో ఓడించి భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న తర్వాత శ్రీజేష్ హాకీకి గుడ్‌బై చెప్పాడు. శ్రీజేష్ చాలా కాలంగా భారత హాకీ జట్టులో ముఖ్యమైన సభ్యుడు. శ్రీజేష్ పారిస్ ఒలింపిక్స్ లోనూ అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు గోడగా నిలిచాడు. స్పెయిన్‌తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో కూడా శ్రీజేష్ చివరి క్వార్టర్‌లో అద్భుతంగా సేవ్ చేసి ఆధిక్యం సాధించకుండా అడ్డుకున్నాడు. ఈ విధంగా శ్రీజేష్‌కు జట్టు విజయంతో వీడ్కోలు పలికింది.