అశ్విన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు.? ఈ ఐదుగురిలో ఒక‌రు ప‌క్కా..!

భారత జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  19 Dec 2024 2:09 PM IST
అశ్విన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు.? ఈ ఐదుగురిలో ఒక‌రు ప‌క్కా..!

భారత జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చ‌ర్చ మొద‌లైంది. వారెవ‌రో చూద్ధాం..

1. వాషింగ్టన్ సుందర్

ఆర్ అశ్విన్ లాగే వాషింగ్టన్ సుందర్ కూడా ఆఫ్ స్పిన్నర్. సుందర్‌ది తమిళనాడు. సుందర్ 2021లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ స‌మ‌యంలో అశ్విన్ స్థానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ టెస్టు ఆడే అవకాశం లభించింది. సుందర్ ఇప్పటివరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్‌తో 387 పరుగులు చేసిన సుంద‌ర్‌ బంతితో 24 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ స్థానంలోకి సుందర్ వస్తాడని అంతా భావిస్తున్నారు.

2. తనుష్ కోటియన్

ముంబై యువ ఆల్ రౌండర్ తనుష్ కొటియన్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో తనుష్ తన సత్తా చాటాడు. ఫస్ట్ క్లాస్‌లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడి 101 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 41 సగటుతో 1,525 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్‌ స్థానంలో తనుష్‌ని తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

3. సరన్ష్ జైన్

ఆర్ అశ్విన్ స్థానంలోకి వచ్చే ఆటగాళ్ల జాబితాలో ఆఫ్ స్పిన్ బౌలర్ శరన్ష్ జైన్ పేరు కూడా ఉంది. 31 ఏళ్ల శరన్ష్ మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడతాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 40 మ్యాచ్‌లలో 26 సగటుతో 1,425 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 123 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

4. కుల్దీప్ యాదవ్

2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కుల్దీప్ యావ్ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి అరంగేట్రం చేశాడు. గత ఏడేళ్లలో కుల్దీప్ ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆర్ అశ్విన్, జడేజాలు ఉండటంతో టెస్టుల్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత 56 టెస్టు వికెట్లు తన పేరిట ఉన్న కుల్దీప్‌కి మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

5. అక్షర్ పటేల్

2021లో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ ఇప్పటివరకు భారత్ తరఫున 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 55 వికెట్లు పడగొట్టాడు. 646 పరుగులు కూడా చేశాడు. అశ్విన్, జడేజాలాగే అక్షర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్. అక్షర్ భారత టెస్ట్ జట్టులో అశ్విన్‌కు ప్రత్యామ్నాయంగా మారగలడు.

Next Story