అతన్ని మైదానంలో దాచి 10 మంది ఫీల్డర్లతో ఆడాం
విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు,
By Medi Samrat Published on 20 Dec 2024 9:08 AM GMTవిజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు, ఆ తర్వాత యువ బ్యాట్స్‌మెన్ విషయంలో వివాదం ముదురుతోంది. పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా జట్టులోకి ఎంపిక కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు అతనికి ముంబై క్రికెట్ అసోసియేషన్ నుండి తగిన సమాధానం వచ్చింది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ పృథ్వీ షాను ఎంపిక చేయకపోవడంపై మౌనం వీడింది. పృథ్వీ షా మళ్లీ క్రమశిక్షణా మార్గదర్శకాలను ఉల్లంఘించాడని.. తనకు తానే శత్రువు అని పేర్కొంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో.. షా ఫిట్‌నెస్ చాలా దారుణంగా ఉందని,.. జట్టు అతన్ని మైదానంలో దాచిపెట్టాల్సి వచ్చిందని.. 10 మంది ఫీల్డర్లతో ఆడామని MCA అధికారి వెల్లడించారు.మైదానంలో పృథ్వీ షా దగ్గరికి బంతి వచ్చినా పట్టుకోడానికి ప్రయత్నించలేకపోయాడు," అని MCA అధికారి PTI కి చెప్పారు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా సరైన సమయంలో బంతి హిట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. అతని ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ప్రవర్తనలో లోపం ఉంది. మేము ఏ ఒక్క ఆటగాడి కోసమే నిబంధనలను మార్చలేమని పేర్కొన్నారు.
పృథ్వీ షా ప్రవర్తన పట్ల ముంబై జట్టు సీనియర్ ఆటగాళ్లు కూడా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. పృథ్వీ షా చాలా శిక్షణా సమావేశాలకు హాజరుకాలేదని.. శిక్షణ సెషన్ మధ్యలో హోటల్ గదికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. దీంతో నిరాశ చెందిన జట్టు సీనియర్ ఆటగాళ్లు షాపై స్వరం పెంచారు.
ప్రస్తుతం పృథ్వీ షాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇది కాకుండా అతని ప్రవర్తన, పేలవమైన ఫిట్‌నెస్ కారణంగా అతను విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. పృథ్వీ షా గురించి MCA అధికారి మాట్లాడుతూ.. పృథ్వీ షాకు శత్రువులు లేరు. తనకు తానే శత్రువు అని వ్యాఖ్యానించాడు.
పృథ్వీ షా ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలి. కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగాలి. అప్పుడే తన కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టగలడు.. తద్వారా తన గత ప్రతిభకు న్యాయం చేయగలడని అంతా ఆశిస్తున్నారు.