ఇంగ్లండ్ వర్ధమాన క్రికెటర్ హ్యారీ బ్రూక్ హిట్టింగ్‌తో క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. బ్రూక్ 9 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేసి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరిట ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో హ్యారీ బ్రూక్ తొలి రోజు ఆట ముగిసే వరకు నాటౌట్ 184 పరుగులు చేశాడు.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ టెస్టు క్రికెట్‌లో తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వినోద్ కాంబ్లీ తన తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలతో 798 పరుగులు చేశాడు. తొమ్మిదో ఇన్నింగ్స్‌లో బ్రూక్ తన అజేయ సెంచరీతో 807 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ 807 పరుగులతో తొలిస్థానంలో ఉండగా.. వినోద్ కాంబ్లీ 798 పరుగుల రెండవ స్థానం, హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 780 పరుగులతో మూడో స్థానం, సునీల్ గవాస్కర్ 778 పరుగులతో నాలుగో స్థానం, ఎవర్టన్ వీక్స్ 777 పరుగులతో ఐదో స్థానంలో ఉంది.
హ్యారీ బ్రూక్ ఇప్పుడు సునీల్ గవాస్కర్ ప్రపంచ రికార్డుపై దృష్టి సారించాడు. తొలి ఆరు టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ రికార్డు సృష్టించాడు. 6 మ్యాచ్‌ల్లో 912 పరుగులు చేశాడు. సర్ డాన్ బ్రాడ్‌మన్ 862 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.