ప్రపంచ కప్ కు సమయం దగ్గరపడుతూ ఉంది. అన్ని జట్లూ సమాయత్తమవుతూ ఉన్నాయి. ప్రపంచ కప్ ముందు పాక్ పేసర్ కివీస్ ఆటగాడి బ్యాట్ ను విరగ్గొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్-పాక్-న్యూజిలాండ్ T20I ముక్కోణపు సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను పాకిస్థాన్ గెలుచుకుంది. ఫైనల్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను పాక్ ఓడించింది. అక్టోబర్ 14, 2022న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగింది, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ 59 పరుగులతో అత్యధిక స్కోరు చేయడంతో న్యూజిలాండ్‌ను 163/7కి పరిమితం చేసింది. మహ్మద్ నవాజ్ 38*, మహ్మద్ రిజ్వాన్ 34 రాణించడంతో పాకిస్తాన్ ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ మంచి స్పెల్ వేశాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో 2/22 తో రాణించాడు. ఆ స్పెల్ సమయంలో ఎంతో స్పీడ్ గా బౌలింగ్ వేశాడు. కివీ బ్యాటర్లను తన పేస్‌తో ఇబ్బంది పెట్టాడు. ఆ పేస్ గ్లెన్ ఫిలిప్స్ ను ఇబ్బంది పెట్టడమే కాదు.. అతడి బ్యాట్ కూడా విరిగిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ నాల్గవ బంతికి రౌఫ్ గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్ విరిగిపోయేంత పేస్ తో బౌలింగ్ వేసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.