టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన మొదటి భారతీయుడు హర్భజన్. ఆస్ట్రేలియాతో జరిగిన 2001 చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తన సంచలనాత్మక బౌలింగ్ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. 3 మ్యాచ్‌లలో 32 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో హర్భజన్ సింగ్ కూడా సభ్యుడు.
హర్భజన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2016లో ఆడాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున గత ఐపిఎల్ మొదటి దశలో కొన్ని మ్యాచ్‌లలో పాల్గొన్న 41 ఏళ్ల హర్భజన్.. తర్వాత జరిగిన రెండవ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
"నా మనస్సులో, నేను ఇంతకు ముందే రిటైర్ అయ్యాను.. కానీ నేను ఈ రోజు ప్రకటన చేస్తున్నాను. జలంధర్ వీధుల నుండి టీమ్ ఇండియాకు టర్బోనేటర్ గా మారిన నా ప్రయాణం చాలా అందంగా ఉంది. ఫీల్డ్ లోకి అడుగుపెట్టడం, ఇండియా జెర్సీ ధరించడం కంటే నా జీవితంలో పెద్ద ప్రేరణ నాకు లేదు. జీవితంలో మనం కఠినమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం వస్తుంది. మీరు జీవితంలో ముందుకు సాగాలి. ఈ ప్రకటనను పబ్లిక్ చేయడానికి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను .. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నానని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చెప్పాడు.