టీమిండియా 'బాపు' బ‌ర్త్‌డే నేడు.. అతని సంపాద‌న‌, విలాసవంతమైన జీవనశైలి గురించి తెలుసా..?

భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 31 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  20 Jan 2025 10:32 AM IST
టీమిండియా బాపు బ‌ర్త్‌డే నేడు.. అతని సంపాద‌న‌, విలాసవంతమైన జీవనశైలి గురించి తెలుసా..?

భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 31 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బౌటింగ్‌, బ్యాటింగ్‌తో రాణిస్తున్న‌ అక్షర్.. చాలా ముఖ్యమైన సందర్భాలలో జట్టు కోసం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గేమ్ ఛేంజర్‌గా అవతరించాడు. అతను 31 బంతుల్లో 47 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లితో అక్షర్ ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతని సహకారంతో టీమ్ ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. టీమిండియాలో 'బాపు' పేరుతో ప్రసిద్ధి చెందాడు అక్షర్. ధోనీ.. అక్ష‌ర్‌ను బాపు పేరుతో పిలిచేవాడు. ర‌వీంద్ర జ‌డేజాతో అత‌నికి ఉన్న‌ అసాధారణ పోలికలను బట్టి అతనిని 'బాపు' అని పిలవడం ప్రారంభించాడు. అక్ష‌ర్‌ పటేల్ పుట్టినరోజు సందర్భంగా.. అతని ఆస్తుల‌ విలువ.. విలాసవంతమైన జీవనశైలి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

అక్షర్ పటేల్ 20 జనవరి 1994న జన్మించాడు. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్‌గా ఎదిగిన‌ అక్షర్ పటేల్.. ఇక్కడికి చేరుకోవడం కోసం చాలా క‌ష్టాల‌ను చూశాడు. వ్యక్తిగత కారణాలతో పోరాడిన‌ప్పటి.. అతను ధైర్యం కోల్పోలేదు. ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో 66 మ్యాచ్‌లు ఆడి బ్యాటింగ్‌లో 498 పరుగులు చేయగా, బౌలింగ్‌లో 65 వికెట్లు తీశాడు. వన్డేల్లో 60 మ్యాచ్‌లు ఆడి 568 పరుగులు చేయగా, బౌలింగ్‌లో 64 వికెట్లు తీశాడు. అక్షర్ 14 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో 646 పరుగులు చేసి.. 55 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్ IPLలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ త‌రుపున‌ ఆడాడు. ఐపీఎల్‌లో 150 మ్యాచుల్లో మొత్తం 1,653 పరుగులు, 123 వికెట్లు తీశాడు.

మీడియా కథనాల ప్రకారం.. అక్షర్ పటేల్ నికర విలువ రూ.49 కోట్లు. అక్షర్ ఏటా రూ.9 కోట్లు.. ప్రతి నెలా రూ.75 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అతనికి ఆదాయం IPL, BCCI కాంట్రాక్టుల నుండి జీతం, ఎండార్స్‌మెంట్‌లు, ఇతర పెట్టుబడుల ద్వారా స‌మ‌కూరుతుంది.

అక్షర్ పటేల్ బిసిసిఐతో గ్రేడ్-బి ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. దీని ద్వారా అతనికి రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది. అక్షర్‌కి టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు ల‌భిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2025 సీజ‌న్ కోసం అక్ష‌ర్‌ను రూ.16.50 కోట్లకు అట్టిపెట్టుకుంది.

అక్షర్ పటేల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. సాధారణంగా రూ. 1 కోటి కంటే ఎక్కువ రేటున్న‌ మెర్సిడెస్ SUV, దాదాపు రూ. 67 లక్షల రేటున్న‌ ల్యాండ్ రోవర్ డిస్కవరీ అత‌ని వ‌ద్ద ఉన్నాయి. ఇది కాకుండా గ్యారేజ్‌లో చాలా కార్లు ఉన్నాయి. అక్షర్ అహ్మదాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియాడ్‌లోని విలాసవంతమైన బంగ్లాలో అతని కుటుంబంతో నివసిస్తున్నాడు.

Next Story