విరాట్ కోహ్లీ-అనిల్ కుంబ్లే వివాదంపై భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలు రావడంతో కోహ్లి ఆ పదవిని చేపట్టాలని తనను సంప్రదించాడని సెహ్వాగ్ చెప్పాడు. ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ అధికారులతో జరిగిన సమావేశాన్ని కూడా సెహ్వాగ్ వెల్లడించాడు. జూన్ 2016లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామకం అయ్యింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కుంబ్లే కాంట్రాక్ట్ ముగిసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఓడిపోవడంతో కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు.
కోహ్లి, కుంబ్లే మధ్య పరిస్థితులు సరిగా లేవని అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి తనతో చెప్పారని, ఆ బాధ్యతను భుజానికెత్తుకోవాలని బోర్డు కోరిందని ప్రముఖ ఛానల్‌తో మాట్లాడుతూ.. వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, అప్పటి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి నన్ను సంప్రదించకుంటే నేను ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోను. మేము సమావేశం అయ్యాము. విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే మధ్య పరిస్థితులు సరిగా లేవని అమితాబ్ చౌదరి నాతో అన్నారు. కోచింగ్ బాధ్యతను మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కుంబ్లే కాంట్రాక్ట్ ముగుస్తోందని, ఆ తర్వాత జట్టుతో కలిసి వెస్టిండీస్‌కు వెళ్లవచ్చని చౌదరి చెప్పాడు. అయితే.. అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా నియమించారని గుర్తు చేశారు.
భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనందుకు పశ్చాత్తాపపడుతున్నారా అని వీరేంద్ర సెహ్వాగ్‌ను ప్రశ్నించారు. దీనిపై సెహ్వాగ్ మాట్లాడుతూ.. 'భారత జట్టుకు కెప్టెన్సీ చేయనందుకు విచారం లేదు. నేను సాధించిన దానితో నేను సంతోషంగా ఉన్నాను. 'నేను నజఫ్‌గఢ్‌లోని చిన్న కుటుంబం నుండి వచ్చాను.. నాకు భారత్‌కు ఆడే అవకాశం వచ్చింది. అభిమానుల నుండి నాకు ఎంతో ప్రేమ, మద్దతు లభించింది. నేను భారత జట్టుకు సారథ్యం వహించినా.. నాకు అంతే గౌరవం లభించేదని అన్నారు.