డిసెంబర్ 12న సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో నిర్ణయాత్మక 14వ గేమ్‌లో ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి భారత గ్రాండ్‌మాస్టర్ D.గుకేశ్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెక్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం 18 సంవత్సరాల వయస్సులో, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత, క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను క్లెయిమ్ చేసిన రెండవ భారతీయుడుగా గుకేశ్ నిలిచాడు.
1985లో 22 ఏళ్ల వయసులో అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా నిలిచిన రష్యా లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ పేరిట ఉన్న రికార్డును కూడా గుకేశ్ బద్దలు కొట్టాడు. డింగ్ లిరెన్ తో జరిగిన మొత్తం 14 గేమ్‌లలో గుకేశ్ 3, లిరెన్ 2 గేమ్‌లో విజయం సాధించారు. తొమ్మిది గేమ్‌లు డ్రా అయ్యాయి. ఈ క్షణం కోసం తాను పదేళ్లుగా కలలు కన్నానని గుకేశ్ అన్నాడు. తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు గుకేశ్. విజయం సాధించానని తెలిసి గుకేష్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు.
గుకేశ్ దొమ్మరాజు 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించారు. గుకేశ్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి రజనీకాంత్ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. ఏడేళ్ల వయసులో అతను చెస్ ఆడటం ప్రారంభించాడు.