ఓట‌మికి కార‌ణాలు చెప్పిన హైదరాబాద్ కెప్టెన్‌

IPL 2025 సీజ‌న్‌ 19వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించింది.

By Medi Samrat
Published on : 7 April 2025 9:42 AM IST

ఓట‌మికి కార‌ణాలు చెప్పిన హైదరాబాద్ కెప్టెన్‌

IPL 2025 సీజ‌న్‌ 19వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. గుజరాత్ టైటాన్స్ 17వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ జట్టులో మహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్‌లు రాణించారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. గిల్ 61 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా నాలుగో ఓటమి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సొంత మైదానంలో ఓడిపోయిన తర్వాత చాలా నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ ప్రెజెంటేషన్ తర్వాత.. అతడు తన జట్టు తప్పిదాల‌ గురించి వివరించాడు.

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో.. ఇది హైదరాబాద్ సాంప్రదాయ వికెట్ కాదని.. చాలా కష్టమైన వికెట్ అని చెప్పాడు. ఈ వికెట్ మేం అనుకున్నంతగా స్పిన్నింగ్ కావడం లేదు. మా స్కోరు కూడా బాగా లేదు, కానీ వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశార‌న్నాడు. స్కోరు బోర్డుపై కొన్ని (పరుగులు) తక్కువగా ఉన్నాయ‌ని.. వారు బాగా బ్యాటింగ్ చేశార‌ని చెప్పాడు.

హైదరాబాద్ పిచ్‌పై ఇలాంటి స‌మ‌యంలో ఆడటం కష్టమని చెప్పాడు. ఆరంభంలో కొన్ని వికెట్లు తీసి ఉంటే కచ్చితంగా మ్యాచ్‌లో ఉండేవాళ్లం అన్నాడు. అలాగే ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలం కాదు. మేము కొంత మంచు ప్రభావం ఉంటుంద‌ని ఆశించాము.. అది కూడా జరగలేదు అన్నాడు. అలాగే.. గుజరాత్ ఫాస్ట్ బౌలింగ్ ఆడటం కూడా చాలా కష్టమ‌ని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. హైదరాబాద్‌లో నితీష్‌రెడ్డి బ్యాటింగ్‌ నుంచి 31 పరుగుల గరిష్ట స్కోరు వచ్చింది. అతడితో పాటు హెన్రిచ్ 27 పరుగులు చేశాడు. హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా పతనమైంది. గుజరాత్ తరఫున మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ, సాయి కిషోర్‌లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

దీనికి సమాధానంగా గుజరాత్ జట్టు ఆదిలో రెండు వికెట్లు కోల్పోయినా.. త‌ర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు ఇన్నింగ్స్‌కు బాధ్యత వహించి, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గిల్ అజేయంగా 61 పరుగులు చేయగా, సుందర్ 49 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి విజయం సాధించింది.

Next Story