మోహిత్ శర్మ చివ‌రి ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ..!

Gujarat Titans won by 7 runs Against Lucknow Super Giants. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన‌ టీ20 లీగ్‌. ఈ లీగ్‌లో ఉత్కంఠ అన్ని హద్దులను దాటుతుంది.

By Medi Samrat  Published on  22 April 2023 8:15 PM IST
మోహిత్ శర్మ చివ‌రి ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ..!

ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన‌ టీ20 లీగ్‌. ఈ లీగ్‌లో ఉత్కంఠ అన్ని హద్దులను దాటుతుంది. ఏ జట్టు ఫలితాన్ని పొందుతుందో అంచనా వేయడం చాలా కష్టం. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ సహాయంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఐపీఎల్‌లో గెలిచింది. అయితే లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మోహిత్ శర్మ బంతితో జట్టుకు గెలుపు అందించాడు. ఐపీఎల్ 2023 30వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లక్నో ముందు 136 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేద‌న‌లో లక్నో జట్టు స్కోరు 110కి చేరుకోగా.. జట్టు చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అంటే కేఎల్ రాహుల్ జట్టు విజయం ఖాయంగా కనిపించింది. ఆ తర్వాత ఆరు ఓవర్లలోనే మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. గుజరాత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో విజయానికి చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాలి. కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో క్రీజులో ఉన్నాడు. ఆ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు చేశాడు రాహుల్. ఐదు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. ఐపీఎల్‌లో మూడేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న మోహిత్ శర్మ మ్యాజిక్ ఇక్కడి నుంచే మొదలైంది. రెండో బంతికే రాహుల్‌ను మోహిత్ పెవిలియన్ కు పంపాడు. తర్వాతి బంతికి మార్కస్ స్టోయినిస్ కూడా మోహిత్ వేసిన స్లో బాల్‌ను అర్థం చేసుకోలేక బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మోహిత్ తర్వాతి రెండు బంతుల్లో దీపక్ హుడా, ఆయుష్ బడోనీలు రనౌట్ అయ్యారు. ఈ విధంగా.. మోహిత్ చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఈ సీజన్‌లో గుజరాత్‌కి నాలుగో విజయాన్ని అందించాడు.


Next Story