గుజ‌రాత్ టైటాన్స్‌ జెర్సీ రంగు మారింది.. ఎందుకో చెప్పిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా

Gujarat Titans in lavender jersey. ఐపీఎల్ 2023 62వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది.

By Medi Samrat
Published on : 15 May 2023 9:15 PM IST

గుజ‌రాత్ టైటాన్స్‌ జెర్సీ రంగు మారింది.. ఎందుకో చెప్పిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2023 62వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి కేవలం ఒక విజయం దూరంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు సొంత మైదానంలో కొత్త అవతారంలో రంగంలోకి దిగింది. వాస్తవానికి జట్టులోని ఆటగాళ్లు బ్లూకు బదులుగా లావెండర్ కలర్ జెర్సీని ధరించి హైదరాబాద్‌పై ఆడేందుకు వచ్చారు.

టాస్ సమయంలో గుజరాత్ టైటాన్స్ కొత్త జెర్సీ వెనుక రహస్యాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. హార్దిక్ మాట్లాడుతూ.. అవును.. ఇది క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక చొరవతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మం. ఇది క్యాన్సర్ రోగులకు మద్దతు ఇచ్చే మా మార్గం అని చెప్పుకొచ్చాడు. గుజరాత్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో పలు మార్పులు చేసింది. విజయ్ శంకర్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక జట్టు వైట్ బాల్ కెప్టెన్ దసున్ షనక ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో షనకను గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.

గాయం కారణంగా విజయ్ శంకర్ జట్టులో లేడ‌ని టాస్ సమయంలో హార్దిక్ పాండ్యా చెప్పాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విజయ్ గాయపడ్డాడు. కేకేఆర్‌పై వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదించుకున్న బౌల‌ర్‌ యశ్ దయాల్‌ను గుజరాత్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఉంచింది.


Next Story