గాయపడిన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్
గాయపడిన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనకను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది.
By Medi Samrat
గాయపడిన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనకను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా గ్లెన్ ఫిలిప్స్ మిగిలిన IPL 2025 నుంచి తప్పుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఫిలిప్స్ గజ్జల్లో గాయానికి గురయ్యాడు. ఈ కారణంగా అతడు టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రస్తుత సీజన్‌లో ఆడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. కానీ ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్‌లో అతను ఐదో ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు.
అయితే, ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడి కొన్ని నిమిషాల్లోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీని తర్వాత గుజరాత్ టైటాన్స్ దసున్ షనకతో రూ.75 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. 33 ఏళ్ల షనక గతంలో 2023 సీజన్‌లో పాల్గొన్నాడు.
ఐపీఎల్‌లో ఒక్క సారిగా షనక తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కించుకున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 26 పరుగులు చేశాడు. షనకకు అనుభవం ఉంది. తన టీ20 కెరీర్‌లో 4,449 పరుగులు, 91 వికెట్లు తీశాడు. షనకను గుజరాత్ టైటాన్స్ జట్టు ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ పటిష్ట ప్రదర్శన చేసి ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ రెండో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గుజరాత్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని పంత్ నేతృత్వంలోని సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలోనే సాధించింది. గుజరాత్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ని శనివారం టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.