అయ్యో.. ఆ క్రికెట్ లెజెండ్‌ ఆత్మహత్య చేసుకున్నాడా.?

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మరణం గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. క్రికెటర్ గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

By Medi Samrat  Published on  12 Aug 2024 2:00 PM GMT
అయ్యో.. ఆ క్రికెట్ లెజెండ్‌ ఆత్మహత్య చేసుకున్నాడా.?

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మరణం గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. క్రికెటర్ గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 100 టెస్టులు, 85 వన్డేలు ఆడిన దిగ్గజ క్రికెటర్ గత వారం మరణించాడు. థోర్ప్ భార్య అమండా మాట్లాడుతూ.. థోర్ప్ ఆందోళన, డిప్రెషన్ తో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చింది. అతను లేకుండా కుటుంబం బాగుంటుందని నమ్మి తన ప్రాణాలను తీసుకున్నాడని అమండా తెలిపింది. అతని మరణం తమకు తీరని లోటు అని.. 2022లో కూడా గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడని అమండా వెల్లడించింది. థోర్ప్ కోలుకోవడానికి కుటుంబసభ్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారని, అయితే వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని క్రికెటర్ భార్య తెలిపింది.

మార్చి 2022లో, గ్రాహం థోర్ప్ ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆ బాధ్యతలను చేపట్టలేకపోయాడు. "గత రెండు సంవత్సరాలుగా, గ్రాహం తీవ్ర డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. మే 2022లో ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. దీని ఫలితంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఎక్కువ కాలం ఉండవలసి వచ్చింది. కొన్ని సమయాల్లో మేము అతనిని కుటుంబంగా చాలా తీవ్రంగా సపోర్ట్ చేసాము. చాలా, చాలా చికిత్సలను కూడా ప్రయత్నించాడు, కానీ దురదృష్టవశాత్తు, వాటిలో ఏదీ పని చేయలేదు" అంటూ ఆమె తన బాధను వ్యక్తం చేసింది.

థోర్ప్ 1993 నుండి 2005 వరకు ఇంగ్లాండ్ తరపున ఆయ‌న‌ 100 టెస్ట్ మ్యాచ్‌లు, 82 వ‌న్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత థోర్ప్.. ఇంగ్లాండ్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ప‌నిచేశాడు. థోర్ప్ తన అంతర్జాతీయ కెరీర్‌ను 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ అరంగేట్రంలో సెంచరీతో ప్రారంభించాడు. 20 ఏళ్లలో ఈ ఘనత సాధించిన మొదటి ఇంగ్లీష్ ఆటగాడిగా నిలిచాడు. అతను 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, 44.7 సగటుతో 6,744 పరుగులు చేశాడు, అతని అత్యధిక స్కోరు 2002లో న్యూజిలాండ్‌పై 200 నాటౌట్. థోర్ప్ 1993 నుండి 2002 వరకు 82 వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు) కూడా ఆడాడు, 37.2 సగటుతో 2,380 పరుగులు చేశాడు.

Next Story