'రూ.10 కోట్ల చీర్ లీడర్' అన్న వీరూ.. స్పందించిన మాక్స్‌వెల్
Glenn Maxwell responds to Virender Sehwag’s ’10 crore cheerleader’ remark. ప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో విధ్వంసకర ఆటగాళ్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకడు.
By Medi Samrat Published on 20 Nov 2020 7:56 PM ISTప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో విధ్వంసకర ఆటగాళ్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకడు. తన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా జట్టుకు, ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహించిన జట్టును ఎన్నో సార్లు గెలిపించాడు. అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(2020) సీజన్‌లో మాత్రం మాక్సీ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున బరిలోకి దిగిన కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. 13 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ ఆటగాడు 15.42 సగటుతో 108 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో మ్యాక్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.10 కోట్ల చీర్ లీడర్ అంటూ భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యంగా విమర్శించాడు. రూ.10కోట్లు తీసుకుని ఇతరుల ప్రదర్శనకు చప్పట్లు కొట్టేవాడిలా మిగిలిపోయాడన్న కోణంలో వీరూ వ్యాఖ్యానించాడు. తాజాగా ఈ కామెంట్స్‌పై స్పందించిన మ్యాక్సీ స్పందించాడు.
సెహ్వాగ్ అలా అనడాన్ని తాను అర్థం చేసుకోగలనని.. వీరూపై తనకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరూ మీడియాలో కొనసాగుతున్నాడు. ఆటగాళ్ల వైఫల్యాలను విమర్శించే హక్కు అతనికి ఉంది. వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నా. ఆ కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు సాగుతా. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు ఉత్ప్రేరకంగా ఉపయోగించుకుంటా'అని మ్యాక్సీ అన్నాడు.
ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం తనకు కొత్త కాదని మ్యాక్సీ తెలిపాడు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కోన్నానని చెప్పుకొచ్చాడు. 'ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్తకాదు. గతంలో కొంత మానసికంగా కుంగిపోయినా ఇప్పుడు బాగానే ఉన్నా.'అని తెలిపాడు. ఇక మానసిక సమస్యతో బాధపడిన మ్యాక్సీ కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్‌తో పునరాగమనం చేయాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఆ లీగ్ వాయిదా పడడంతో.. ఐపీఎల్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మ్యాక్సీ ఆడనున్నాడు.