మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వన్డే జట్టుకు బౌలర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై శ్రీకాంత్ చేసిన విమర్శలను గంభీర్ ఖండించాడు. గంభీర్ కోసం ఎప్పుడూ తల ఊపే హర్షిత్ రాణాను ఈ పర్యటనకు ఎంపిక చేశారని శ్రీకాంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటని, సొంత యూట్యూబ్ ఛానల్ కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను విమర్శించడం సరికాదని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హర్షిత్ రాణాను మెరిట్ ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేశామని, హర్షిత్ రాణా తండ్రి సెలక్షన్ కమిటీలో లేరని, ఆయన మాజీ క్రికెటర్ కాదని, ఎన్ఆర్ఐ కూడా కాదని గంభీర్ అన్నారు. హర్షిత్ తన సామర్థ్యంతో క్రికెట్ ఆడుతున్నాడని, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని గంభీర్ సూచించాడు. హర్షిత్ రాణా పది మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడని గంభీర్ గుర్తు చేశాడు. ఆ నైపుణ్యం కూడా సరిపోదని అనుకుంటే సెలక్షన్ కమిటీ అతడిని తప్పిస్తుందని అన్నాడు.