బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త లీగ్ ను మొదలుబెట్టబోతున్నామని కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తూర్పు ఢిల్లీ క్రికెట్ లీగ్‌ను ఆరంభించనున్నట్లు వెల్లడించారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా శుక్రవారం ప్రకటించారు. తన నియోజకవర్గంలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేసిన గంభీర్.. దీనిని ప్రపంచస్థాయి మైదానంగా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు ఢిల్లీ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి జట్లను ఎంపిక చేసి.. ఈస్ట్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నవంబరు రెండో వారంలో ఈ టోర్నీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రంజీ ట్రోఫీ నిర్వహణ స్థాయికి తగ్గట్లు యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. రెండు డ్రెస్సింగ్‌రూంలు, హైమాస్ట్ లైట్స్, ఆరు పిచ్‌లు, ప్రాక్టీసు పిచ్‌లు, డిజిటల్ స్కోరు బోర్డు డిస్‌ప్లే, కానపీ, జాగింగ్ ట్రాక్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల 25 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. క్రికెట్‌తో పాటు ఆర్చరీ కోసం కూడా దీనిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.