ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2022 విజేతగా నిలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభినందించారు. శనివారం ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ ఐదవ ప్రపంచ కప్ టైటిల్‌ను ముద్దాడింది. "అండర్ 19 జట్టు, సహాయక సిబ్బంది, సెలెక్టర్‌లు ఇంత అద్భుతంగా ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు అభినందనలు. మేము ప్రకటించిన 40 లక్షల నగదు బహుమతి ఒక చిన్న ప్రశంస టోకెన్.. వారి కృషి వెలకట్టలేనిది.. అని గంగూలీ ట్విట్టర్‌లో ద్వారా ప్రశంసలు కురిపించాడు. ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచింది.
గతంలో 2000, 2008, 2012, 2018లో గెలిచిన భారత్‌కు ఇది ఐదవ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్. అండర్-19 జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ప్రతి ఆటగాడికి రూ. 40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల రివార్డును ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు భారతదేశం గర్వపడేలా చేసారని బీసీసీఐ సెక్రటరీ జే షా ట్వీట్ చేశారు. మొదట రాజ్ బవా(5/31), రవి కుమార్ (4/34) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రాణించడంతో ఇంగ్లండ్‌ను 189 పరుగులకు ఆలౌట్ చేసింది యువ భారత్. జేమ్స్ రెవ్ (95) పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక బారత ఆటగాళ్లు షేక్ రషీద్ (84 బంతుల్లో 50), నిశాంత్ సింధు అర్ధ సెంచరీలతో చెలరేగగా, రాజ్ బావా (54 బంతుల్లో 35) కూడా రాణించడంతో భారత్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.