ఆ ఇద్దరి వల్లే ఈ విజయం : రోహిత్ శర్మ
Games like these teach you a lot says Rohit Sharma.శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2023 9:15 AM GMTఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా ఉమ్రాక్ మాలిక్ రెండు, అక్షర్ ఓ వికెట్ పడగొట్టాడు. లంక బ్యాటర్లలో ఫెర్నాండో(50) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఛేదనలో తొలుత తడబడ్డా కేఎల్ రాహుల్(64 నాటౌట్; 103 బంతుల్లో 6 పోర్లు) పోరాడడంతో లక్ష్యాన్ని టీమ్ఇండియా 43.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. హార్థిక్ పాండ్య(36; 53 బంతుల్లో 4 ఫోర్లు) అతడికి సహకరించాడు. శ్రీలంక వెన్ను విరిచిన కుల్‌దీప్ యాదవ్‌కు "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్" అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ల అద్భుత ప్రదర్శన కారణంగానే రెండో వన్డేలో విజయం సాధించినట్లు చెప్పాడు. ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో విషయాలను నేర్పుతాయన్నాడు. ఇక నామమాత్రమైన మూడో వన్డేలో మార్పులు ఉంటాయన్నాడు.
"ఇది లో స్కోరింగ్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో విషయాలు నేర్పుతాయి. తీవ్ర ఒత్తిడిలో మెరుగ్గా రాణించారు. ఇక వన్డేల్లో కొన్నాళ్ల నుంచి రాహుల్ ఐదో స్థానంలో ఆడుతున్నాడు. దీని వల్ల అతడి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా బ్యాటింగ్ లోతు పెరుగుతుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. టాప్ 5లో ఎడమ చేతి వాటం బ్యాటర్ ఉంటే బాగుంటుంది. అయితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోను. మా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల ఎలా ఆడుతారు అనే విషయం మాకు బాగా తెలుసు. ఒత్తిడిలో ఎలా ఆడాలో వారికి వారికి తెలుసు." అని రోహిత్ అన్నాడు.
ఇక ఆఖరి మ్యాచ్‌లో మార్పుల గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. చివరి మ్యాచ్ జరిగే వేదికకు వెళ్లాక పిచ్ కండిషన్స్, ఆటగాళ్ల పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఈ సిరీస్ తరువాత కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లపై ఎక్కువ పని భారం వేయం. మాకు లాంగ్ సీజన్ ఉన్న నేపథ్యంలో ప్రతీది పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. అవసరం అయితే మార్పులు చేస్తాం అని రోహిత్ చెప్పాడు.