టెస్ట్ క్రికెట్‌కు డుప్లెసిస్ గుడ్ బై.. షాక్‌లో దక్షిణాఫ్రికా బోర్డు..!
Former South Africa captain Faf Du Plessis announces retirement from test cricket.దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై
By తోట వంశీ కుమార్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. 36 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ తన దేశం కోసం 69 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 40.03 సగటుతో 4163 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో 10 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ 199. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని తన మనసు చెబుతోందని డుప్లెసిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.
ఫాఫ్ నిర్ణయంతో దక్షిణాఫ్రికా బోర్డు షాక్ తింది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్ల సేవలు కోల్పోయి సతమవుతున్న దక్షిణాఫ్రికా జట్టుకు డుప్లెసిస్ లేకపోవడం తీరని లోటే అని చెప్పవచ్చు. 2012 నవంబర్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన డుప్లెసిస్.. తాజాగా రావల్పిండిలో పాకిస్తాన్‌పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పాకిస్థాన్‌పై ఇటీవల ఆడిన టెస్ట్ సిరీస్‌లో డుప్లెసిస్ ఘోరంగా విఫలం అయ్యాడు. రెండు టెస్టుల్లో 10, 23, 17, 5 స్కోర్లు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికా టీమ్‌కు 36 టెస్టుల్లో సారధ్యం వహించిన ఫాఫ్ డుప్లెసిస్.. 18 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు.
ఈ నెల చివర్లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ తరువాత రిటైర్‌మెంట్ ప్రకటించాలని భావించినట్లు చెప్పాడు. అయితే.. కోవిడ్ -19 ఆందోళనల కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా పర్యటనను చివరి నిమిషంలో వాయిదా వేసింది. దీంతో ఇదే సరైన సమయం అని భావించి రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు.
టెస్టుల నుంచి రిటైరైన తర్వాత తాను టీ20లపై దృష్టి సారించనున్నట్లు ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. ఈ ఏడాది భారత్‌లో, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. ఈ ఫార్మాట్లలో ప్రపంచంలో జరిగే అన్ని లీగ్‌లలో ఆడుతూ.. ప్రపంచకప్‌కు సిద్ధం కావాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. వన్డేల్లోనూ ఆడతానని చెప్పినడుప్లెసిస్.. టీ20లే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫాఫ్ ఆడుతున్న విషయం తెలిసిందే.