టీమిండియా పేసర్ డేవిడ్ జాన్సన్ మృతి.. విషాదంలో భారత క్రికెట్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ మరణవార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 20 Jun 2024 5:00 PM ISTటీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ మరణవార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ సెక్రటరీ జై షా సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. నివేదికల ప్రకారం.. జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. జాన్సన్ వయసు 52 సంవత్సరాలు. కర్ణాటక బౌలర్ డేవిడ్ జాన్సన్ తన కుడి చేతితో మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కూడా. జాన్సన్ టీమ్ ఇండియా తరఫున 2 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు తీశాడు.
జాన్సన్ 10 అక్టోబర్ 1996న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. విశేషమేమిటంటే.. అదృష్టవశాత్తూ డేవిడ్ జాన్సన్ టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ఢిల్లీ టెస్టులో భారత స్టార్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ గాయపడ్డాడు. దీంతో జాన్సన్‌ను అదృష్టం వరించింది. ఈ టెస్టులో కర్ణాటక సహచరుడు వెంకటేష్ ప్రసాద్‌తో కలిసి జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మైకేల్ స్లేటర్‌ను డకౌట్ చేశాడు.
ఆ తర్వాత జాన్సన్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే నిలకడ లేకపోవడంతో అతని టెస్టు కెరీర్ కేవలం 2 మ్యాచ్ లకే పరిమితమైంది. జాన్సన్ 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు తీశాడు. అతను 33 లిస్ట్ A మ్యాచ్‌లలో 41 వికెట్లు పడగొట్టాడు.
దేశవాళీ క్రికెట్‌లో జాన్సన్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. జాన్సన్ 1995-96 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో కేరళపై 152 పరుగులకు 10 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అజేయ శతకాన్ని కూడా సాధించాడు. అతను 2015లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. జాన్సన్ ఆత్మహత్య చేసుకోవడంతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.