ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కామెంట్రీ చెబుతుండగా ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను స్టేడియం నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ది డైలీ టెలిగ్రాఫ్ ప్రకారం, పాంటింగ్ ను పెర్త్ ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్ బంధువులు, తన అనుచరులతో.. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
"రికీ పాంటింగ్ అనారోగ్యంతో ఉన్నారు.. నేటి కవరేజీకి వ్యాఖ్యానం అందించరు" అని ఛానల్ 7 ప్రతినిధి చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. గత కొన్నేళ్లుగా షేన్ వార్న్, రాడ్ మార్ష్, ఆండ్రూ సైమండ్స్, డీన్ జోన్స్ చనిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ సమాజం ఇప్పటికీ ఇంకా షాక్ లోనే ఉంది. ఇప్పుడు రికీ పాంటింగ్ కు గుండెపోటు వచ్చిందనే వార్త వినగానే వారిలో మరింత భయం మొదలైంది.