కెప్టెన్‌గా రేపే రీఎంట్రీ ఇవ్వనున్న శ్రేయాస్ అయ్యర్..!
విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు ముంబై జట్టు కెప్టెన్‌గా టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ నియమితులయ్యారు.
By - Medi Samrat |
విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు ముంబై జట్టు కెప్టెన్‌గా టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ నియమితులయ్యారు. గాయం కారణంగా శార్దూల్ ఠాకూర్ అందుబాటులో లేకపోవడంతో గాయం నుంచి తిరిగి మైదానంలోకి వస్తున్న అయ్యర్‌కు ఈ పెద్ద బాధ్యత అప్పగించారు.
సోమవారం ముంబై జట్టులో చేరిన శ్రేయాస్.. కోచ్‌లు ఓంకార్ సాల్వి, అతుల్ రనడే ఆధ్వర్యంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ముంబై జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను నియమించినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో మిగిలిన మ్యాచ్‌లకు ముంబై సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ని నియమించినట్లు MCA ప్రకటించింది.
విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ దశ తర్వాత ముంబై జట్టు కెప్టెన్‌గా అయ్యర్ కొనసాగడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంతర్జాతీయ డ్యూటీ కోసం అతనికి ఇచ్చిన ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. బరోడాలో జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు అయ్యర్‌ను జట్టులో చేర్చారు. వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయాస్‌ను ఒక షరతుతో ఎంపిక చేశారు. ఇటీవల వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ, అయ్యర్ ఫిట్‌నెస్‌ను 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో అంచనా వేస్తారని, అతను ఫిట్‌గా ఉంటేనే వన్డే జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. అతను పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రిక్‌బజ్ ఆదివారం నివేదించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జనవరి 11న బరోడాలో జరుగుతుంది.
అయ్యర్ అంతర్జాతీయ పునరాగమనానికి గ్రీన్ సిగ్నల్ పొందినట్లయితే జనవరి 12న ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు MCA రెండవ కెప్టెన్‌ని నియమించాల్సి ఉంటుంది. అన్ని విషయాలు తేలిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎంసీఏ సెక్రటరీ ఉన్మేష్ ఖాన్విల్కర్ తెలిపారు. మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లలో శ్రేయాస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
గతేడాది అక్టోబరులో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో గాయానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు మంగళవారం అంటే 6 జనవరి 2026న అతడు మూడు నెలల తర్వాత క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.
ముంబయి జట్టు ప్రస్తుతం గ్రూప్ సిలో రెండో స్థానంలో కొనసాగుతూ తదుపరి రౌండ్‌కు చేరుకునేందుకు పటిష్ట స్థితిలో ఉంది. తదుపరి లీగ్ మ్యాచ్‌లను మంగళవారం (జనవరి 6) హిమాచల్ ప్రదేశ్‌తో, జనవరి 8న పంజాబ్‌తో ఆడతారు. ఈ రెండు మ్యాచ్‌లు జైపూర్‌లో జరగనున్నాయి.