నేడు భారత్‌, దక్షిణాఫ్రికా ఢీ.. టీమ్ఇండియా గెల‌వాల‌ని పాక్ ప్రార్థ‌న‌లు

Fans across Pakistan will pray for India's win over South Africa.టీమ్ఇండియా మ‌రో కీల‌క స‌మ‌రానికి సిద్ద‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2022 4:09 AM GMT
నేడు భారత్‌, దక్షిణాఫ్రికా ఢీ.. టీమ్ఇండియా గెల‌వాల‌ని పాక్ ప్రార్థ‌న‌లు

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 టోర్నీలో టీమ్ఇండియా మ‌రో కీల‌క స‌మ‌రానికి సిద్ద‌మైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఆరంభ పోరులో పాకిస్తాన్‌పై నెగ్గి, ఆ త‌రువాత ప‌సికూన నెద‌ర్లాండ్స్‌ను మట్టి క‌రిపించిన భార‌త్ ఆదివారం ద‌క్షిణాఫ్రికాను ఢీ కొట్ట‌నుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విజ‌యం సాధిస్తే దాదాపుగా సెమీస్ బెర్తు ఖాయం కానుంది.

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించిన‌ టీమ్‌ఇండియా నాలుగు పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌ నెగ్గి, మరో మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్‌కు అర్హత సాధించడం దాదాపు ఖాయం కావడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం టీమ్ఇండియాను వేదిస్తున్న అతిపెద్ద స‌మ‌స్య కేఎల్ రాహుల్ ఫామ్‌. రెండు మ్యాచుల్లోనూ విఫ‌లం కావ‌డంతో అత‌డిని త‌ప్పించి పంత్ ను తీసుకోవాల‌నే డిమాండ్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. అయితే.. రాహుల్ పై జ‌ట్టు మేనేజ్‌మెంట్ న‌మ్మ‌కం ఉంచింది. అత‌డు ఫామ్ అందుకోవ‌డానికి ఒక్క ఇన్నింగ్స్ స‌రిపోతుందని అంటున్నారు.

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫామ్ అందుకోగా, కోహ్లీ ఊపు కొన‌సాగిస్తుండ‌గా, సూర్య కుమార్ త‌న‌దైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ ముగ్గురు మ‌రోమారు త‌మ జోరును కొన‌సాగించాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. పెర్త్ పిచ్ స్పిన్న‌ర్లకు పెద్ద‌గా స‌హ‌క‌రించ‌దు. ఈ నేప‌థ్యంలో అక్ష‌ర్ ప‌టేల్‌ను ప‌క్క‌న బెట్టి అత‌డి స్థానంలో హ‌ర్షల్ ప‌టేల్‌ను ఆడించే అవ‌కాశం ఉంది. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, హ‌ర్ష్‌దీప్ సింగ్‌, మ‌హ్మ‌ద్ ష‌మి ఇప్ప‌టి వ‌ర‌కు మంచి ప్ర‌ద‌ర్శ‌నే చేశారు. అయితే.. బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ ఉన్న స‌ఫారీల‌పై వీరు ఎంత మేర‌కు ప్ర‌భావం చూపుతారో చూడాల్సిందే.

బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికా జట్టు డికాక్‌, రోసో, మిల్లర్‌, మార్‌క్ర‌మ్ ల‌పై భారీ ఆశలనే పెట్టుకుంది. అయితే.. రబాడ, నోర్జే, లుంగి ఎంగ్డీ రూపంలో ప్రపంచ అత్యుత్తమ పేసర్లు అందుబాటులో ఉండటం ప్రొటీస్‌కు కలిసొచ్చే అంశం. పెర్త్ పిచ్ లో వీరిని ఎదుర్కొన‌డం భార‌త బ్యాట్స్‌మెన్ల‌కు స‌వాలే.

భార‌త విజ‌యం కోసం పాక్ ప్రార్థ‌న‌లు..

అశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. నేటి మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాపై భార‌త్ విజ‌యం సాధించాల‌ని పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి ఓ కార‌ణం ఉంది. పాక్ జ‌ట్టు సెమీస్ చేర‌డం భార‌త్ చేతుల్లోనే ఉంది. ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌ ల‌పై భార‌త్ గెలిచి ఆ జ‌ట్ల సెమీస్ అవ‌కాశాల‌ని దెబ్బ తీస్తే పాక్ ముంద‌డుగు వేయ‌డానికి అవ‌కాశంఉంది.

గ్రూప్-2లో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాకిస్తాన్‌ ఇంకా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ పాక్‌ విజయం సాధించినా సెమీస్‌కు చేరడం కష్టమే. బాబర్ సేన సెమీస్‌కు చేరుకోవాలంటే భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తోపాటు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపైనా విజయం సాధించాలి. అందుక‌నే భార‌త జ‌ట్టు మిగిలిన మ్యాచ్‌లు గెల‌వాల‌ని పాక్ జ‌ట్టు కోరుకుంటోంది.

ఇదిలా ఉంటే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు 5 సార్లు త‌ల‌ప‌డ్డాయి. నాలుగుసార్లు భార‌త్ విజ‌యం సాధించ‌గా, ఒక్క‌సారే ద‌క్షిణాఫ్రికా గెలిచింది.

Next Story