క్రికెట్ స్టేడియంలలో ఒక్కోసారి అభిమానులు సెక్యూరిటీని దాటి మరీ దూసుకుని వచ్చేస్తూ ఉంటారు. గతంలో చాలాసార్లు అభిమానులు అలా దూసుకుని వచ్చి తమకు ఇష్టమైన క్రికెటర్లను తాకారు కూడానూ..! ఇక కరోనా కాలంలో అభిమానులు లేకుండానే చాలా సిరీస్ లు జరుగుతూ ఉన్నాయి. బయో బబుల్ లో ఆటగాళ్లు ఉంటూ వస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ నుండి భారత్ లో అభిమానులను గ్రౌండ్ లోకి అనుమతి ఇస్తూ వస్తున్నారు. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ సమయంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని దూసుకుని వచ్చాడు. దీంతో కోహ్లీ దూరంగా ఉండాలంటూ ఆ అభిమానిని కోరాడు.
కోహ్లీ అలా దూరంగా వెళ్లిపోవడం చూసిన ఆ వీరాభిమాని నిరాశగా వెనుదిరిగాడు. కరోనా నేపథ‍్యంలో ప్రస్తుతం ఆటగాళ్లందరూ బయో బబుల్ సెక్యూరిటీలో ఉన్నారు. బయో బబుల్ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ మేరకు ఆటగాళ్లను, మ్యాచ్ అధికారులను ఎవరినీ కలవడానికి అనుమతించరు. మ్యాచ్ ముందు శిక్షణ సెషన్ల సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక అభిమాని ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడంపై మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అభిమాని ఎవరో గుర్తించి.. అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.