హెడింగ్లేలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 278 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఓపెనర్ రోహిత్ శర్మ(59), పుజారా అర్ధశతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. 215-2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ నాటకీయంగా వికెట్లు కోల్పోయింది. 73 పరుగుల తేడాతో 8 వికెట్లు చేజార్చుకుంది.
అంతకుముందు.. పుజారాను అవుట్ చేయడం ద్వారా భారత్ పతనానికి ఓల్లీ రాబిన్సన్ శ్రీకారం చుట్టాడు. సెంచరీకి 9 పరుగుల దూరంలో పుజారా అవుట్ కాగా.. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (55), రహానే (10) కూడా వెనుదిరిగారు. పంత్ కేవలం 1 పరుగు చేసి నిరాశపరిచాడు. షమి(6), ఇషాంత్(2), జడేజా(30), సిరాజ్(0) కనీసం పోరాటం కూడా చేయకుండా వెనుదిరిగారు. బుమ్రా(1) నాటౌట్‌గా నిలిచాడు. చివరికి భారత్ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. రాబిన్సన్ కు 5 వికెట్లు, ఓవర్టన్‌కు మూడు వికెట్లు లభించాయి. సిరీస్‌లో నాలుగో టెస్టు సెప్టెంబర్ 2న జరుగనుంది.