పాక్ కు చుక్కలు చూపించేసింది.. క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్

England won by 8 wkts. పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌ను 3-0తో ఓడించింది.

By Medi Samrat  Published on  20 Dec 2022 3:15 PM GMT
పాక్ కు చుక్కలు చూపించేసింది.. క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్

పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌ను 3-0తో ఓడించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు మూడో, ఆఖరి టెస్టులో 8 వికెట్ల తేడాతో పాక్ పై విజయం సాధించింది. 60 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఇంగ్లండ్‌ ఓడించింది. కరాచీ టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ ముందు పాకిస్తాన్ కేవలం 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆఖరి రోజు తొలి సెషన్‌లోనే విజయాన్ని సొంతం చేసుకున్నది. టెస్ట్ సిరీస్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ టీ20, వన్డేల తరహాలో సాగింది. పాక్ కు ఏ మాత్రం అవకాశం దక్కలేదు.

17 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది.రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో 74 పరుగుల తేడాతో, ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. మూడో టెస్టులో కూడా ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కరాచీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేసింది. సమాధానంగా ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి 50 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ అయింది. నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఛేదించి విజయాన్ని అందుకున్నది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 35, బెన్ డకెట్ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.


Next Story