నిర్ణ‌యాత్మ‌క చివ‌రి వ‌న్డే నేడే.. సిరీస్‌పై కన్నేసిన భార‌త్‌, ఇంగ్లాండ్

England vs India 3rd ODI Today.టీ20 సిరీస్ సాధించిన ఊపులో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌ను గొప్ప‌గా ఆరంభించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2022 4:07 AM GMT
నిర్ణ‌యాత్మ‌క చివ‌రి వ‌న్డే నేడే.. సిరీస్‌పై కన్నేసిన భార‌త్‌, ఇంగ్లాండ్

టీ20 సిరీస్ సాధించిన ఊపులో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌ను గొప్ప‌గా ఆరంభించింది. అయితే.. రెండో మ్యాచ్‌లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇక ఈ ప‌ర్య‌న‌ట‌లో చివ‌రి పోరు, వ‌న్డే సిరీస్ ఫ‌లితాన్ని నిర్ణ‌యించే మ్యాచ్ కు మాంచెస్టర్ వేదిక కానుంది. నేడు జ‌రిగే మ్యాచ్‌లో ఎవ‌రు గెలిస్తే వారే సిరీస్‌ను సొంతం చేసుకుంటారు కాబ‌ట్టి ఇంగ్లాండ్‌, భార‌త్ జ‌ట్లు హోరా హోరాగా త‌ల‌ప‌డతాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇరు జ‌ట్ల‌లోని బౌల‌ర్లు విజృంభిస్తుండ‌గా, బ్యాట‌ర్ల నిల‌క‌డ‌లేమి ఇరు జ‌ట్ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

విరాట్ కోహ్లీ ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళ‌న క‌లిగిస్తోంది. విరాట్ సెంచ‌రీ చేయ‌క దాదాపు మూడేళ్లు కావొస్తుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లోనూ కోహ్లీ వైఫ‌ల్యం కొన‌సాగుతోంది. క‌నీసం చివ‌రి మ్యాచ్‌లోనైనా రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రోవైపు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ మున‌ప‌టిలా ధాటిగా ఆడ‌లేక‌పోతున్నాడు. రోహిత్ బాగానే ఆడుతున్న‌ప్ప‌టికీ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాల‌మైంది. సూర్య‌కుమార్, హార్థిక్ లు రెండో వ‌న్డేలో ఓ మోస్తారు స్కోర్లే చేశారు. జ‌డేజా బ్యాటింగ్ లో ఫ‌ర్వాలేనిపిస్తున్నా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, ష‌మి, చాహ‌ల్ లు అద్భుతంగా రాణిస్తున్నారు. రెండు వ‌న్డేల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని ప్ర‌సిద్ధ్ కృష్ణ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవ‌కాశం ద‌క్కొచ్చు.

ఇక విధ్వంస‌క‌ర ఆట‌గాళ్ల‌కు నిల‌యమైన ఇంగ్లాండ్ సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్‌ను కోల్పోకూడ‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. బ‌ట్ల‌ర్‌, బెయిర్ స్టో, రూట్, స్టోక్స్‌, లివింగ్ స్టోన్ ల‌లో ఏ ఇద్ద‌రూ నిలిచినా భార‌త్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. బౌలింగ్‌లో టాప్లీ ఒక్క‌డే రాణిస్తుండ‌డం ఇంగ్లాండ్‌కు ఆందోళ‌న క‌లిగించే అంశం. టాప్లీతో పాటు మిగ‌తా బౌల‌ర్లు రాణించాల‌ని ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ బ్యాటింగ్‌కు బౌలింగ్‌కు స‌మానంగా స‌హ‌క‌రిస్తుంది. ఇక్క‌డ జ‌రిగిన చివ‌రి 9 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టే నెగ్గింది. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు లేదు.

Next Story