విజయం కోసం వెళతారా.. డ్రాతో సరిపెడతారా..?
England Tour Of India First Test. ఇటీవలి కాలంలో టెస్ట్ మ్యాచ్ లు ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉన్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 8 Feb 2021 7:24 PM IST
ఇటీవలి కాలంలో టెస్ట్ మ్యాచ్ లు ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉన్న సంగతి తెలిసిందే..! భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ లు గెలవడానికి కూడా ఆఖరి రోజు ఆడిన ఆటే కారణం అయింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ విషయంలో కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఎంతో ముఖ్యంగా నిలవనుంది. భారత్ విజయానికి ట్రై చేస్తుందా..? లేక డ్రా చేసుకోవాలని ఆడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. లేక స్పిన్ అవుతున్న పిచ్ పై భారత్ ను ఇంగ్లాండ్ బోల్తా కొట్టిస్తుందా అన్నది కూడా ఆఖరి రోజు తెలియనుంది.
చెన్నె టెస్టులో భారత్ గెలవాలంటే 420 పరుగులు చేయాలి. ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 178 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ జో రూట్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓలీ పోప్ (28), జోస్ బట్లర్ (24), డామ్ బెస్ (25) రాణించడంతో ఇంగ్లండ్ ఆధిక్యం 400 పరుగులు దాటింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేయగా, భారత్ 337 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
420 పరుగుల లక్ష్యఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బంతికి బౌల్డయ్యాడు. భారత్ గెలవాలంటే ఇంకా 381 పరుగులు అవసరం ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. శుభ్ మాన్ గిల్ (15), ఛటేశ్వర్ పుజారా (12) క్రీజులో ఉన్నారు.