అప్పుడు బుమ్రా టీమ్‌లో లేడు.. ఇప్పుడు ఉన్నాడు.. ఆ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటారా.?

వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. గురువారం సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి

By Medi Samrat  Published on  26 Jun 2024 10:42 AM GMT
అప్పుడు బుమ్రా టీమ్‌లో లేడు.. ఇప్పుడు ఉన్నాడు.. ఆ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటారా.?

వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. గురువారం సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో సెమీస్‌లో భార‌త్‌ ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్‌పై గతంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది.

2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఘోర పరాజయం చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే సాధించింది. ప్రస్తుత టోర్నీలో భారత జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది.

ప్రస్తుత టోర్నీలో ఇంగ్లండ్ జట్టు గత సెమీఫైనల్స్‌లో ఉన్నంత‌ బలంగా కనిపించడం లేదు. గ్రూప్ దశలో జోస్ బట్లర్ నాయకత్వంలో ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అదే సమయంలో సూపర్-8లో జరిగిన ఓ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు భారత జట్టు అన్ని మ్యాచ్‌ల్లోనూ పటిష్ట ప్రదర్శన చేసి విజయం సాధించింది. రోహిత్ శర్మ అండ్ కో గ్రూప్ స్టేజ్, సూపర్-8 రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలిచారు.

గతంతో పోలిస్తే భారత జట్టులో చాలా మార్పులు కనిపించాయి. టీ20 ప్రపంచకప్ 2022లో జస్ప్రీత్ బుమ్రాను భారత్ కోల్పోయింది. వెన్ను గాయం కారణంగా అతను టోర్నీలో పాల్గొన‌లేక‌పోయాడు. దీంతో సెమీఫైనల్‌లో భారత జట్టు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వరుసగా 80, 86 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్ మహ్మద్ షమీ భారీగా పరుగులు ఇచ్చాడు. ష‌మీ తన మూడు ఓవర్ల స్పెల్‌లో 13 ఎకానమీ రేటుతో 39 పరుగులు ఇచ్చాడు. అయితే ఈసారి గాయం కారణంగా ష‌మీ టోర్నీకి దూరమయ్యాడు.

ప్రస్తుత టోర్నీలో భారత జట్టు బౌలింగ్ అటాక్ విధ్వంసం సృష్టిస్తోంది. భారత్ తరఫున బుమ్రా ఆరు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ ఇప్పటి వరకు మొత్తం 15 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక స్పిన్నర్ల గురించి చెప్పాలంటే కుల్దీప్ యాదవ్ ఏడు వికెట్లు, అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తీశారు.

గత సెమీ-ఫైనల్ మ్యాచ్‌తో పోలిస్తే భారత్ ప్లేయింగ్ 11 చాలా మారింది. ఈసారి టీమిండియాలో నలుగురు ఆటగాళ్లు లేరు. గ‌త జ‌ట్టులో కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్‌పై భారత్ ఓటమికి ఈ నలుగురు ఆటగాళ్లే ప్రధాన కారణం. కేఎల్ రాహుల్ ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో ముగ్గురు బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. నలుగురూ తమ పేర్లకు తగినట్లుగా రాణించలేకపోయారు, దీని కారణంగా ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై పైచేయి సాధించింది.

Next Story