రికార్డు సృష్టించేందుకు వికెట్ దూరంలో బ్రావో

Dwayne Bravo 1 wicket away from surpassing Lasith Malinga.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2022 2:45 PM IST
రికార్డు సృష్టించేందుకు వికెట్ దూరంలో బ్రావో

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో చ‌రిత్ర సృష్టించేందుకు కేవ‌లం వికెట్ దూరంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సీజ‌న్‌లో ఇంకో వికెట్ తీస్తే చాలు .. ఈ మెగా టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన వీరుడిగా నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు శ్రీలంక పేస్ దిగ్గ‌జం, ముంబై ఇండియ‌న్స్ మాజీ ఆట‌గాడు ల‌సిత్ మ‌లింగ‌(170)తో స‌మానంగా ఉన్నాడు. నేడు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఈ నేప‌థ్యంలో బ్రావో ఈ మ్యాచ్‌లో వికెట్ తీస్తే త‌న పేరిట కొత్త రికార్డును నెల‌కొల్ప‌నున్నాడు. కాగా.. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై బ్రావో 3 వికెట్లు తీసిన సంగ‌తి తెలిసిందే. ల‌సిత్ మ‌లింగ్ 122 మ్యాచుల్లో 170 వికెట్లు ప‌డ‌గొడితే.. బ్రావో 152 మ్యాచుల్లోనే అన్నే వికెట్లు తీశాడు. ఇక వీరిద్ద‌రి త‌రువాత అమిత్‌ మిశ్రా (166), పీయూష్ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150), రవిచంద్రన్ అశ్విన్ (145) లు వ‌రుస‌గా మూడు, నాలుగు, ఐదు ఆరు స్థానాల్లో ఉన్నారు. వీరిలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాత్ర‌మే ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఆడుతున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ర‌వీంద్ర జ‌డేజా నేతృత్వంలో ఈ సీజ‌న్‌లో బ‌రిలోకి దిగిన చెన్నై తొలి మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. దీంతో ల‌క్నో పై విజ‌యం సాధించి బోణీ కొట్టాల‌ని బావిస్తోంది. మ‌రో వైపు ల‌క్నో కూడా త‌మ తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మిపాలైంది. దీంతో కేఎల్ రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో కూడా ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రీ ఈ రెండు జ‌ట్ల‌లో ఏ జట్టు గెలిచి పాయింట్ల ఖాతాను తెరుస్తుందో చూడాలి.

Next Story