నా కోచింగ్ కెరీర్‌లో బ్యాడ్ మూమెంట్ అదే.. ద్రవిడ్ విచారం
భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కోచింగ్ కెరీర్‌లో వైఫల్యాల గురించి వెల్లడించాడు
By Medi Samrat Published on 10 Aug 2024 3:24 PM GMTభారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కోచింగ్ కెరీర్‌లో బ్యాడ్ మూమెంట్ గురించి వెల్లడించాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవనందుకు చింతిస్తున్నానని ద్రవిడ్ చెప్పాడు. ద్రవిడ్ నవంబర్ 2021లో కోచ్‌గా నియమితులయ్యారు. ద్రవిడ్ హయాంలో సెంచూరియన్ టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. దక్షిణాఫ్రికాలో తమ తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడానికి చేరువైంది. అయితే దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టుల్లో పుంజుకుని స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆ రికార్డును నిలబెట్టుకుని అజేయంగా మిగిలిపోయింది.
ఆ సిరీస్‌ను గుర్తుచేసుకుంటూ ద్రవిడ్ తన కోచింగ్ కెరీర్‌లో ఇదో బ్యాడ్ మూమెంట్‌గా అభివర్ణించాడు. ద్రవిడ్ ఒక స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ... మీరు నన్ను అధ్వాన్నమైన క్షణం గురించి అడిగితే.. నేను దక్షిణాఫ్రికా సిరీస్‌ని అలాగే భావిస్తాను. మేము దక్షిణాఫ్రికాలో మొదటి టెస్ట్ గెలిచాము. మాకు మరో రెండు టెస్టులు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో మేం ఎన్నడూ టెస్టు సిరీస్ గెలవలేదు. అక్కడ సిరీస్ గెలవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. మా సీనియర్ ఆటగాళ్లు కొందరు ఆ పర్యటనలో లేరు. చివరి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో.. దక్షిణాఫ్రికాకు మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.. కానీ రోహిత్ శర్మ గాయపడ్డాడు.. ఆ సిరీస్‌లో ఆడేందుకు మాకు పెద్దగా సీనియర్ ఆటగాళ్లు లేరని చెప్పాడు. రెండు టెస్టు మ్యాచ్‌లు గెలవడానికి చాలా దగ్గరగా వచ్చాం. మాకు పెద్ద అవకాశం వచ్చింది. కానీ దక్షిణాఫ్రికా బాగా ఆడింది. నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని సాధించింది. సిరీస్ గెలవలేకపోవడం నా కోచింగ్ కెరీర్‌లో బ్యాడ్ మూమెంట్ అని చెప్పాలనుకుంటున్నాను.
స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధానికి గురైన కారణంగా విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌లో ఆడలేదు. అతని గైర్హాజరీతో రెండో టెస్టులో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తీసుకున్నాడు. రెండో టెస్టులో 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడో టెస్టులో కూడా 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.