వినేష్ బరువు విషయంలో ఏం జరిగిందో చెప్పిన చీఫ్ మెడికల్ ఆఫీసర్
వినేష్ ఫోగట్ అనర్హత వేటు తర్వాత భారత జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పౌడివాలా ప్రకటన వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 7 Aug 2024 6:54 PM ISTవినేష్ ఫోగట్ అనర్హత వేటు తర్వాత భారత జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పౌడివాలా ప్రకటన వెలుగులోకి వచ్చింది. వినేష్ బరువును తగ్గించడానికి.. ఆమె బరువును తగ్గించగలిగే ప్రతీ చర్య తీసుకున్నప్పటికీ.. ఇంకా 100 గ్రాముల అదనపు బరువు ఉందని పౌడివాలా చెప్పారు.
వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫైనల్‌కు అనర్హత వేటు పడింది. మంగళవారం జరిగిన 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్‌లో వినేష్ ఫోగట్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది. అయితే ఫైనల్‌కు ముందు నిర్వహించిన వెయిట్ మెజర్‌మెంట్‌లో 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది.
డాక్టర్ దిన్షా పౌడివాలా మాట్లాడుతూ.. వినేష్ రోజుకు 1.5 కిలోల పోషకాహారాన్ని తీసుకుంటుంది. ఇది ఆమెకు మ్యాచ్‌లకు తగినంత శక్తిని ఇస్తుంది. కొన్నిసార్లు మ్యాచ్‌ల తర్వాత బరువు పెరుగుట జరుగుతుంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి వినేష్‌కు మూడు మ్యాచ్‌లలో నీరు మాత్రమే ఇచ్చాం. ఆ తర్వాత కూడా వినేష్ అధిక బరువుతో ఉంది. మొదట బరువు తగ్గడానికి సాధారణ ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ.. బరువు తగ్గకపోవడంతో మేము రాత్రంతా బరువు తగ్గించే ప్రక్రియను కొనసాగించాము. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. వినేష్ బరువు 50 కిలోల బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నాం. మేము ఆమె జుట్టును కత్తిరించడం.. ఆమె బట్టలు కుదించడం వంటి అన్ని కఠినమైన చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ.. మేము ఆమె బరువును 50 కిలోల బరువు కేటగిరీకి తీసుకురాలేకపోయాము. అనర్హత వేటు పడిన తర్వాత డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు వినేష్‌కు ముందుజాగ్రత్తగా ఫ్లూయిడ్స్ ఇచ్చామని డాక్టర్ తెలిపారు.